ఉగ్రవాద నిరోఽధంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర
ABN , First Publish Date - 2023-03-19T23:14:51+05:30 IST
దేశ సరిహద్దులో అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరోధించడంలో సీఆర్పీఎఫ్ దళాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కలికిరి సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలోని సీఐఏటీ-3 (ఉగ్రవాద నిరోధక తీవ్రవాద వ్యతిరేక) శిక్షణ సంస్థ కమాండెంట్ కె.సి.నిర్మల్ తెలిపారు.
వ్యవస్థాపక దినోత్సవంలో కమాండెంట్ కె.సి.నిర్మల్
కలికిరి, మార్చి 19: దేశ సరిహద్దులో అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరోధించడంలో సీఆర్పీఎఫ్ దళాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కలికిరి సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలోని సీఐఏటీ-3 (ఉగ్రవాద నిరోధక తీవ్రవాద వ్యతిరేక) శిక్షణ సంస్థ కమాండెంట్ కె.సి.నిర్మల్ తెలిపారు. ఆదివారం శిక్షణ సంస్థ ప్రాంగణంలో జరిగిన 84వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిత్య సంఘర్షణ ప్రాంతాలైన జమ్మూ, కశ్మీర్, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద జిల్లాలతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలను సీఆర్పీఎఫ్ నిరంతర పోరాటాలతో సమర్థవంతంగా ఎదురొడ్డి నిలువరిస్తున్నదని కొనియాడారు. మొదట 1939 జూలై 27న మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ పేరుతో స్థాపించబడినా స్వాతంత్ర్యానంతరం 1949లో అప్పటి హోం మంత్రి సర్ధార్ వల్లభాయి పటేల్ దళానికి పేరు మార్చి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా నామకరణం చేశారని కమాండెంట్ వివరించారు. ఆ తరువాత 1950 మార్చి 19న సీఆర్పీఎఫ్ దళానికి అత్యంత గౌరవప్రదమైన ప్రెసిడెంట్ కలర్ ఆపాదించారని, అదే వ్యవస్థాపక దినంగా కొనసాగుతోందని చెప్పారు. సీఆర్పీఎ్‌ఫలో ఆర్‌ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్), క్రౌడ్ కంట్రోల్, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) ఇలా వివిధ రకాల బెటాలియన్లు దేశ అంతర్గత రక్షణలో ప్రాణాలొడ్డి పోరాటం చేసున్నాయని తెలిపారు. మొదట సీఆర్పీఎఫ్ నూతన జెండాను ఆవిష్కరించి అనంతరం అమర జవాన్ల స్థూపం వద్ద మిలిటరీ పుష్పగుచ్చ ఉంచి నివాళులర్పించారు. ప్రత్యేక దళం బ్యాండు, తుపాకులతో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం క్యాంప్‌సలో వాలీబాల్ ఇతర మ్యాచ్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్లు ఎ.కె.సింగ్, శివప్రసాద్, కదమ్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్లు రవికుమార్, హనుమాన్ రామ్, గిరిథర్, జీ/240 మహిళా బెటాలియన్ దళం, ట్రైనీలు, ఎస్‌ఓలతో పాటు ఇతర ర్యాంకు అధికారులు పాల్గొన్నారు.