గండికోట లోయ 1200 మిలియన్‌ సంవత్సరాల నాటిది

ABN , First Publish Date - 2023-01-05T23:43:24+05:30 IST

పర్యాటక ప్రాంతమైన గండికోట లోయ 1200 మిలియన్‌ సంవత్సరాలకు ముందు ఏర్పడిందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సీనియర్‌ జియాలజిస్టు పామిశెట్టి హరికుమార్‌ పేర్కొన్నారు. గురువారం గండికోటను హైదరాబాదులోని జియోలాజికల్‌ సర్వే

గండికోట లోయ 1200 మిలియన్‌ సంవత్సరాల నాటిది

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జియాలజిస్టు వెల్లడి

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 5: పర్యాటక ప్రాంతమైన గండికోట లోయ 1200 మిలియన్‌ సంవత్సరాలకు ముందు ఏర్పడిందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సీనియర్‌ జియాలజిస్టు పామిశెట్టి హరికుమార్‌ పేర్కొన్నారు. గురువారం గండికోటను హైదరాబాదులోని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బృందం సందర్శించింది. ముందుగా వారు ఇక్కడి జుమ్మామసీదు, ధాన్యాగారం, రంగనాయకులస్వామి ఆలయం పరిశీలించారు. అనంతరం సహజసిద్ధంగా ఏర్పడిన గండికోట లోయను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పడిన రాళ్లు, శిలల గురించి, చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఎలా, ఎప్పుడు ఏర్పడ్డాయో వారు విద్యార్థులకు తెలియజేశారు.

సీనియర్‌ జియాలజిస్టు పామిశెట్టి హరికుమార్‌ మాట్లాడుతూ భారతదేశంలో గండికోట లోయ లాంటి ప్రదేశం మరొకటి లేదన్నారు. ఈ ప్రాంతం చిత్రావతి నది గ్రూపు కింద మూడు రకాలుగా ఏర్పడిందన్నారు. అందులో ఇసుక, మట్టి, రాయి గురించి వివరించారు. చిత్రావతి గ్రూపు కింద మొదట పులివెందుల ప్రాంతం గట్టిగా రాళ్లు, శిలలు సుమారు 1900 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయన్నారు. అలాగే తాడిపత్రి ప్రాంతం కొండలలో రాయి సుమారు 1800 మిలియన్‌ సంవత్సరాల ముందు ఏర్పడిందన్నారు. గండికోట ప్రాంతం లోయ పరిసరాలు 1200 మిలియన్‌ సంవత్సరాలకు ముందు ఏర్పడ్డాయన్నారు.

అనంతరం జియాలజిస్టు ప్రశాంత్‌కుమార్‌శుక్లా మాట్లాడుతూ జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సదరన్‌ రీజియన్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హైదరాబాదు సంయుక్తంగా ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ పురస్కరించుకుని గండికోటను విద్యార్థులతో కలసి సందర్శించామన్నారు. ఎర్రమల కొండల గుండా పెన్నానది ప్రవహించడంతో 6 నుంచి 7 కిలోమీటర్ల పొడవునా లోయ ఏర్పడిందన్నారు. ఇది గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి చెందిందన్నారు. జాతీయ జియో హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించబడిందన్నారు. గండికోట కొండల దిగువన పెన్నానది ప్రవహిస్తోందని 200 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉంటుందన్నారు. ఈ సహజ నిర్మాణాన్ని అమెరికాలోని గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఆరిజోనాతో పోల్చుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ ప్రసాద్‌, నాగేశ్వరరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-05T23:43:28+05:30 IST