LOKESH: సీమలో సంరంభం

ABN , First Publish Date - 2023-06-13T03:36:26+05:30 IST

డీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమలో మంగళవారం పూర్తి కానుంది. జగన్‌ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై ప్రజల కష్టాలుతెలుసుకునేందుకు జనవరి 27న కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు.

LOKESH: సీమలో సంరంభం

125 రోజులు.. 1,587 కిలోమీటర్ల పాదయాత్ర

రాయలసీమలో లోకేశ్‌ పాదయాత్ర ప్రస్థానం

జనవరి 27న కుప్పంలో ప్రారంభం

44 నియోజకవర్గాలు, 108 మండలాలు,

943 గ్రామాల గుండా ప్రయాణం

యువత, మహిళల నుంచి అపూర్వ స్పందన

(కడప-ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమలో మంగళవారం పూర్తి కానుంది. జగన్‌ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై ప్రజల కష్టాలుతెలుసుకునేందుకు జనవరి 27న కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం, పోలీసులు కల్పించిన అడ్డంకులను అధిగమించి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 108 మండలాలు, 943 గ్రామాల గుండా నడిచారు బుధవారంతో 125 రోజులవుతాయి. 3 కిలోమీటర్లు మాత్రమే నడుస్తారు. అంటే 1,587 కిలోమీటర్లు నడచినట్లవుతుంది. సాయంత్రం 5.10 గంటలకు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లెలో అడుగుపెట్టడంతో రాయలసీమలో ఆయన పాదయాత్ర ముగుస్తుంది.

ఇప్పటి వరకు సీమలో పలువురు చేసిన పాదయాత్రల రికార్డులన్నింటినీ లోకేశ్‌ యువగళం తిరగరాసిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించగా అనంతపురంలో 9, కర్నూలులో 14, కడప జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఈ యాత్రకు జగన్‌ సర్కారు సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. జీవో నంబర్‌ వన్‌ను అడ్డుపెట్టుకుని పోలీసుల ద్వారా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన పాదయాత్ర గంట గంటకూ టెన్షన్‌గా మారింది. మైకు పట్టుకుంటే అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకోవడం.. అడుగు ముందుకు వేస్తే కేసులు పెట్టడం సర్వసాధారణమైంది. ప్రచార రథం, సౌండు సిస్టం, మైకు, స్టూలు సహా అన్నింటినీ పోలీసులు లాక్కెళ్లారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పీలేరులో బాణసంచా పేల్చారని లోకేశ్‌, అచ్చెన్నాయుడు, కుప్పం సీఎస్‌ మనోహర్‌, పలమనేరు, చంద్రగిరి, పీలేరు ఇన్‌చార్జులు అమరనాథ్‌రెడ్డి, నాని, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సహా పలువురిపై కేసులు పెట్టారు.

సీఎం సొంత జిల్లాలో కేక..

లోకేశ్‌ పాదయాత్ర సీఎం జగన్‌ సొంత గడ్డ కడపలో ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జనం వస్తారా.. వారిని వైసీపీ నేతలు రానిస్తారా.. అసలు ఆయన్ను నడవనిస్తారా.. అని రాష్ట్రమంతా చర్చ నడచింది. కానీ కెవ్వుకేక అయిందని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో గత నెల 23న పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం నుంచి ప్రారంభమైంది. జమ్మలమడుగులో తొలి బహిరంగ సభ జరిగింది. సభ జన సంద్రంగా మారింది. ప్రొద్దుటూరులో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దారి పొడవునా చంద్రబాబును విమర్శించేలా ఫ్లెక్సీలు వేశారు. అయితే జనం భారీ ఎత్తున వచ్చారు. ప్రొద్దుటూరులోనే లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక మైదుకూరు, చెన్నూరు, సిద్దవటం సభలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్‌ అయ్యాయి. సోమవారం బద్వేలులో నిర్వహించిన సభకు జనం సునామీలా వచ్చారు.

‘మిషన్‌ రాయలసీమ’తో అభివృద్ధి

రాయలసీమ అభివృద్ధికి ‘మిషన్‌ రాయలసీమ’ను లోకేశ్‌ కడపలో ప్రకటించారు. పెండింగులోని సాగునీటి ప్రాజె క్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడం, వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, సీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడంతో పాటు పండ్ల తోటల ప్రోత్సాహం, 90 శాతం సబ్సిడీ, గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటించారు. అలాగే సీమలో పరిశ్రమల స్థాపన, ఎలకా్ట్రనిక్స్‌, ఆటోమొబైల్స్‌ కంపెనీల ఏర్పాటు, ఉక్కు ఫ్యాక్టరీలను, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కారిడార్‌ ఆఽధారిత పరిశ్రమలు, పర్యాటకరంగ అభివృద్ధికి టెంపుల్‌ టూరిజం, ఎకోటూరిజం, టైగర్‌ ఎకోటూరిజంతో ఉపాధి అవకాశాలు.. ఇలా అనేక హామీలిచ్చారు.

ముఖాముఖి

పాదయాత్ర పొడవునా ప్రతి నియోజకవర్గంలో అన్ని వర్గాల వారితో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలు, రైతులు, న్యాయవాదులు, నిరుద్యోగ యువత, చర్చి ఫాదర్లు, బ్రాహ్మణులు తదితరులతో చర్చించారు. పాదయాత్రలో జిల్లాకో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 2న ‘యువత కోసం హలో లోకేశ్‌’.. ఏప్రిల్‌ 8న అనంతపురం జిల్లా సింగనమలలో ‘రైతన్నలతో లోకేశ్‌’.. ఏప్రిల్‌ 24న పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఆదోనిలో ‘పల్లె ప్రగతి కోసం మీ లోకేశ్‌’.. మే 7న కర్నూలులో ముస్లింలతో ప్రత్యేక కార్యక్రమం.. కడపలో ఈ నెల 7న రాయలసీమ అభివృద్ధిపై ‘మిషన్‌ రాయలసీమ’ పేరుతో సీమ మేధావులు, ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

సెల్ఫీలతో లోకేశ్‌

తనను కలిసేందుకు వచ్చిన అభిమానులతో విడిది కేంద్రం వద్ద లోకేశ్‌ ప్రతిరోజూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు లక్షా60వేల మందితో సెల్ఫీలు దిగారు. డీసీఎల్‌, జోగో డిక్సన్‌, కియా, టిడ్కో ఇళ్ల వద్ద లోకేశ్‌ సెల్ఫీలతో చాలెంజ్‌చేయడం బాగా ఆకట్టుకున్నాయి.

పదునైన విమర్శలు

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై లోకేశ్‌ పదునైన విమర్శలు గుప్పించారు. చిత్తూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అవినీతిపై పాపాల పెద్దిరెడ్డి అంటూ విమర్శించారు. ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అక్రమాలను ఆధారాలతో చూపించారు. టీడీపీ గద్దెనెక్కితే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తుంగభద్ర, ఎల్‌ఎల్‌సీ ఆఽధునికీకరణ, రూ.1,986 కోట్లతో ఆర్‌డీఎస్‌ కుడికాల్వ పనులు, డ్రిప్‌ ఇరిగేషన్‌, మదనపల్లెలో టమోటా ప్రాసెసింగ్‌ సబ్‌ యూనిట్‌, గండికోటలో స్టీలు ఫ్యాక్టరీ, ఉరవకొండలో మెగా ట్రిప్‌ ప్రాజెక్టు, ఆదోనిలో మిర్చి యార్డు కోల్డ్‌ స్టోరేజీ, వేదవతి ప్రాజెక్టు పూర్తి, సింగనమలలో చీనీ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఎమ్మిగనూరులో మెగా టెక్స్‌టైల్స్‌ ఏర్పాటు సహా పలు హామీలిచ్చారు.

Updated Date - 2023-06-13T04:30:17+05:30 IST