ఓం నమఃశివాయ

ABN , First Publish Date - 2023-02-18T23:24:48+05:30 IST

తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లయ్యకొండపై వెలసిన భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి శనివారం వేకువజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు.

ఓం నమఃశివాయ
మల్లయ్యకొండపైన స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు

శివనామ స్మరణలతో మార్మోగిన శైవక్షేత్రాలు

మల్లయ్యకొండకు పోటెత్తిన భక్తులు

అఖండ మల్లేశ్వరుడిగా దర్శనమిచ్చిన మల్లన్న

హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమఃశివాయ.. అంటూ భక్తుల శివనామస్మరణలతో జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ మార్మోగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన మల్లయ్యకొండ, చిట్వేలి, గుండాలకోన, రాజంపేటలోని హత్యరాల, సిద్దవటంలోని నిత్యపూజస్వామికోనతో పాటు రాయచోటి, రాజంపేట, మదనపల్లె, పీలేరు, రైల్వేకోడూరు తదితర మండలాల్లోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి.

తంబళ్లపల్లె, ఫిబ్రవరి 18: తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లయ్యకొండపై వెలసిన భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి శనివారం వేకువజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలిరావడంతో కొండ మొత్తం భక్తులతో నిండిపోయింది. అఖండ మల్లేశ్వరుడి అలంకారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కాలినడకన మల్లయ్యకొండకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు ఈశ్వరప్ప శనివారం తెల్లవారుజామునే స్వామి వారిని అఖండ మల్లేశ్వరునిగా అలంకరించి ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక అభిషేకాలు, సహస్త్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఆలయ పాలకమండలి చైర్మన్‌ కేఆర్‌ మల్‌రెడ్డి, ఈవో రమణ ఆధ్వర్యంలో కట్టా సంజీవపవన్‌కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ శివ పార్వతుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. మల్లయ్యకొండ కింద మద్దాభక్తుని బావి వద్ద మల్లికార్జునస్వామి సేవా సమితి (అన్నదాన ట్రస్ట్‌) ఆధ్వర్యంలో వేల మంది భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2023-02-18T23:24:50+05:30 IST