ఇసుక తవ్వకాలను ఆపాలి..!
ABN , First Publish Date - 2023-03-31T23:39:33+05:30 IST
మండలంలోని గంగాపురం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాలను కలికిరి మండలం మహల్, అద్దవారిపల్లె గ్రామస్తులు శుక్రవారం అడ్డుకొన్నారు. వందల సంఖ్యలో రైతు కుటుంబాలు వాహనాలకు అడ్డుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గంగాపురం ఇసుక రీచ్‌లో వాహనాలను అడ్డుకొన్న రైతులు
వందల సంఖ్యలో గుమికూడిన జనం
పోలీసుల హామీతో తాత్కాలిక విరమణ
మళ్లీ యథేచ్ఛగా తవ్వకాలు
కలకడ, మార్చి 31: మండలంలోని గంగాపురం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాలను కలికిరి మండలం మహల్, అద్దవారిపల్లె గ్రామస్తులు శుక్రవారం అడ్డుకొన్నారు. వందల సంఖ్యలో రైతు కుటుంబాలు వాహనాలకు అడ్డుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి ప్రకృతి సంపద అయిన బహుదా నదిలో ఇసుకను కాపాడుకుంటున్నామని, అయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఇసుక రీచ్‌కు మంజూరు చేసిందని వాపోయారు. కాంట్రాక్ట్ పొందిన గుత్తేదారు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నది ఎడారిగా మారి వ్యవసాయ, గ్రామ పంచాయతీ తాగునీటి బోర్లు సైతం ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సదురు గ్రామాలకు సంబంధించిన రైతుల భూములు కలకడ మండలం గంగాపురంలో ఉన్నాయని తెలిపారు. ఈ పొలాలకు నీటి ఆధారమైన చెరువులు, కుంటలు లేవన్నారు. వేలాది కుటంబాలు బహుదా నది నుంచి పారే నీటి వనరులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పంట పొలాలకు ఆధారమైన కాలవలకు నీరు అందక వేలాది ఎకరాలు బీడుగా దర్శనమిస్తునట్లు చెప్పారు. తమ పొలాల వద్దకు చేరుకొనేందుకు నది నుంచి నడకను కొనసాగిస్తునట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ఇసుక రీచ్‌లో తవ్వకాలను నిలిపి తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు.
ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు
గంగాపురం ఇసుక రీచ్‌లో తవ్వకాలను రైతులు అడ్డుకొన్నా రని తెలుసుకున్న కలకడ, కలికిరి ఎస్‌ఐలు తిప్పేస్వామి, లోకేశ్‌లు తమ సిబ్బందితో అక్కడకు చేరుకొన్నారు. ప్రజలకేమైనా సమస్యలుంటే సంబంధిత రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతానికి సోమవారం వరకు తవ్వకాల పనులు జరగకుండా చూస్తామని వారికి హామీ ఇచ్చి శాంతింపజేశారు.
యథావిధిగా తవ్వకాలు
రైతులు, పోలీసులు రీచ్ నుంచి వెనుతిరగగానే ఇసుక తవ్వకాలను యథేచ్ఛగా సాగినట్లు రైతులు తెలిపారు. పోలీసులు రీచ్‌లో సమస్య పరిష్కారమయ్యే వరకు ఇసుకను తవ్వరాదంటూ వ్యాపారులకు సూచించారు. అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లగానే ఇసుకాసురులు ఇష్టానుసారంగా ట్రాక్టర్లలో తరలించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.