నిర్లక్ష్యపు నీడలో సామాజిక ఆరోగ్య కేంద్రం

ABN , First Publish Date - 2023-04-15T23:14:11+05:30 IST

జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి (సామాజిక ఆరోగ్య కేంద్రం) ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యపు నీడలో ఉన్నట్లుగా ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

నిర్లక్ష్యపు నీడలో సామాజిక ఆరోగ్య కేంద్రం
సామాజిక ఆరోగ్య కేంద్రం

కలగా మారిన వంద పడకలు ఫ ఇదీ జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి తీరు

జమ్మలమడుగు, ఏప్రిల్‌ 15: జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి (సామాజిక ఆరోగ్య కేంద్రం) ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యపు నీడలో ఉన్నట్లుగా ప్రజలు విమర్శలు చేస్తున్నారు. తాడిపత్రి రోడ్డులో ప్రధాన రోడ్డుకు పక్కన సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతంగా ఉంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా కొత్త జీవోను తీసుకురావడం జరిగింది. అయితే టీడీపీ హయాంలో సైతం వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు అప్పట్లో అప్పటి ప్రభుత్వం జీవోను తెచ్చినా తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి పనితీరు విమర్శలకు తావిస్తోంది. గతంలో పాలకులు ప్రతి కార్యక్రమంపై దృష్టి కేంద్రీకరించి రోగులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేవారు. అయితే వైసీపీ హయాంలో ఇంతవరకు వంద పడకల ఆస్పత్రి కలగా మిగిలిపోతోందని పలువురు వాపోతున్నారు. అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్టు డాక్టర్లను భర్తీ చేయాలని అసెంబ్లీలో అడిగినా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్టు, ముగ్గురు డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే చెవి, ముక్కు, గొంతు, సంబంధించి వైద్యులు ఉన్నప్పటికీ పరికరాలు లేక డాక్టర్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆస్పత్రిలో డెంటల్‌ ఎక్స్‌రే లేదు. పబ్లిక్‌ హాలిడే రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలోని కొన్ని విభాగాలు అందులో టీబీ, మందులు అందించే గది మూత వేస్తున్నట్లుగా రోగులు ఆరోపిస్తున్నారు. వంద పడకలకు బడ్జెట్‌ మంజూరైనా స్థలం కొత్త చోట చూడటమా, లేక ఉన్నదానిపై నిర్మించడమా దేనిమీద శ్రద్ధ చూపడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్‌ డెలవరీలు చేస్తున్నారని అయితే అందులో కిందిస్థాయి సిబ్బందిలో ఓ మహిళ డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ రఫిక్‌పాషాను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆస్పత్రిలోని సిబ్బంది కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిన తర్వాత అలాంటివారిని పిలిపించి హెచ్చరించడం జరిగిందన్నారు. ఇకపై డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని చెప్పడం జరిగిందన్నారు. వంద పడకలకు సంబంధించి స్థానిక ఆర్డీవో శ్రీనివాసులును కలవడం జరిగిందని, స్థలం కేటాయింపు జరుగలేదన్నారు. ఒకవేళ ఉన్న ఆస్పత్రిపైనే కొత్త నిర్మాణాలు చేయాలన్నా అధికారులు రావాల్సి ఉంది. ఆస్పత్రిలో గైనకాలజిస్టు పోస్టులు భర్తీ చేయలేదు.

Updated Date - 2023-04-15T23:14:23+05:30 IST