Uday Kumar Reddy Arrested : వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి అరెస్టు

ABN , First Publish Date - 2023-04-15T02:49:24+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం.. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.

Uday Kumar Reddy Arrested : వివేకా హత్య కేసులో  ఉదయ్‌కుమార్‌రెడ్డి అరెస్టు

అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. మృతదేహానికి కట్లు కట్టిన కాంపౌండర్‌ ఉదయ్‌ తండ్రే

హత్య జరిగిన రోజు భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఇతడూ ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌లో నిర్ధారణ

వివేకా ఇంటికీ వెళ్లాడంటున్న సీబీఐ.. గతంలో సీబీఐ అధికారులపై ఉదయ్‌ ఆరోపణలు

విచారణాధికారి రాంసింగ్‌పై కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు.. దాని ఆధారంగానే కేసు

తెల్లవారుజామునే పులివెందులకు సీబీఐ బృందం.. ఉదయ్‌ విచారణ.. అరెస్ట్‌

అనంతరం హైదరాబాద్‌కు తరలింపు.. 14 రోజులు రిమాండ్‌ విధించిన కోర్టు

కడప, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం.. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి పులివెందులకు వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం.. జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి ఎదురుగా జగన్‌ క్యాంపు కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇంటికి తెల్లవారుజామున ఐదుగంటలకు చేరుకుంది. విచారణ కోసం సీఆర్పీసీ 161 నోటీసిచ్చి.. ఆయన్ను కడప సెంట్రల్‌ జైలులోని అతిథిగృహానికి అధికారులు తీసుకొచ్చారు. తండ్రి జయప్రకాశ్‌రెడ్డిని కూడా కడప సెంట్రల్‌ జైలు వద్దకు రావాలని చెప్పడంతో ఆయన అడ్వకేట్‌ సూర్యప్రకాశ్‌రెడ్డితో కలిసి అతిఽథిగృహానికి వచ్చారు. వారిద్దరి సమక్షంలోనే ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు మెమో అందించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అతడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అరెస్టు చేసినట్లు పులివెందుల పోలీసులకు కూడా సమాచారం అందించారు. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్‌ విధించింది. శుక్రవారం రాత్రి భారీ బందోబస్తు నడుమ అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం ఆ జైలులోనే ఉన్నారు. కాగా.. శనివారం ఉదయ్‌ను విచారించేందుకు సీబీఐ శనివారం కస్టడీకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హత్య జరిగిన రోజు భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే

వివేకాను 2019 మార్చి 15న తెల్లవారుజామున 1.30 నుంచి 3 గంటల మధ్య నిందితులు హత్య చేశారు. దేవిరెడ్డి శివశంక ర్‌రెడ్డి ఆదేశాల మేరకు వివేకా మృతదేహానికి కట్లు కట్టడానికి వైద్యులను, సిబ్బందిని తీసుకురావడం, బ్యాండేజీలు తీసుకురావడం, ఫ్రీజర్‌బాక్సు, అంబులెన్స్‌ ఏర్పాటులో ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలక పాత్ర పోషించాడని సీబీఐ చెబుతోంది. ఈయన తండ్రి జయప్రకాశ్‌రెడ్డి.. ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండరు. వివేకా తలకు ఉన్న గొడ్డలిపోట్లకు జయప్రకాశ్‌రెడ్డిని పిలిపించే కుట్లు, బ్యాండేజీ వేయించారని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేగాక.. వివేకా హత్య జరిగిన రోజు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో కలిసి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా ఆధారాలు సేకరించింది. వివేకా హత్య గురించి 2009 మార్చి 15న ఉదయం 6.26 గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. అయితే ఉదయ్‌కుమార్‌రెడ్డి 6.25 గంటలకే అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని.. తర్వాత 6.29 గంటల నుంచి 6.31 గంటల వరకు వివేకా ఇంట్లో కూడా ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా సీబీఐ నిర్ధారణకు వచ్చింది.

రాంసింగ్‌పై ఫిర్యాదు

వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. వివేకా హత్యకు గురయ్యాడని నాటి ఉదయం పక్కింటి మహిళ లక్ష్మీదేవి ఉదయ్‌కుమార్‌రెడ్డి తల్లి పద్మావతమ్మకు చెప్పగా.. ‘మీకు ఇప్పుడు తెలిసిందా, మావా డికి 3.39గంటలకే తె లిసింది. అప్పుడే మావాడు బయటకుపోయాడు’ అని పద్మావతమ్మ ఆమెకు చెప్పారు. అప్పట్లో సీబీఐ బృందం లక్ష్మీదేవిని విచారించినప్పుడు ఈ విషయం తెలిపారు. అలాగే హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప-పులివెందుల మార్గంలో రెండుసార్లు బైకుపై తిరిగినట్లు సీబీఐ సీసీ ఫుటేజీలో గుర్తించింది. అప్పట్లో విచారణకు హాజరైన ఉదయ్‌కుమార్‌రెడ్డి సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయడంతో పాటు మొన్నటి వరకు విచారణాధికారిగా పనిచేసిన రాంసింగ్‌పైనా కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

అవినాశ్‌రెడ్డికి స్కూల్‌మేట్‌!

ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఉదయ్‌కుమార్‌రెడ్డి అత్యంత సన్నిహితుడని, వీరిద్దరూ పులివెందులలోని సెయింట్‌ ఆంటోనీ స్కూలులో కలిసి చదువుకున్నారని సమాచారం. అవినాశ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశాడని అంటున్నారు. ఆ సాన్నిహిత్యంతో తుమ్మలపల్లెలోని యురేనియం కార్యాలయంలో ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉద్యోగిగా చేరాడని తెలిసింది. అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడని.. వారు ఏ పని అప్పజెబితే అది తప్పకుండా చేస్తాడని పులివెందులలో చెబుతారు.

పులివెందులలో కలకలం..

ఉదయ్‌కుమార్‌రెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా పులివెందులలో కలకలం రేగింది. ఎంపీ అవినాశ్‌రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేస్తామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు గతంలోనే తెలియజేసింది. అప్పట్లో నేడో రేపో అవినాశ్‌ అరెస్టవుతారని ప్రచారమూ జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశాలున్నా సరే సీఎం జగన్‌ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లడం.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను కలవడం.. ఆ తర్వాత రామ్‌సింగ్‌పై శంకర్‌రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. విచారణాధికారిగా రాంసింగ్‌ను తప్పించి కొత్త అధికారులతో ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగా దర్యాప్తు పూర్తిచేస్తామని కోర్టుకు సీబీఐ హామీ ఇచ్చింది. తదనంతరం కేసు కాస్త నెమ్మదించింది. దస్తగిరికి బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అక్కడ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక బృందం ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయడం గమనార్హం.

Updated Date - 2023-04-15T02:49:24+05:30 IST