నీటిశుద్ధి కేంద్రాలు.. నిరుపయోగం

ABN , First Publish Date - 2023-05-25T23:41:25+05:30 IST

మండలంలోని కోనంపేట, లక్కిరెడ్డిపల్లెలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉండడంతో ఈ రెండు ప్రాంతాల్లో పేదలకు శుద్ధి చేసిన నీటిని అందించాలనుకున్నారు. వెంటనే 2014లో అప్పటి ఎంపీ మైసూరారెడ్డి నిధులతో నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు.

నీటిశుద్ధి కేంద్రాలు.. నిరుపయోగం
లక్కిరెడ్డిపల్లెలో మరమ్మతులకు నోచుకోని నీటిశుద్ధి కేంద్రం

ఒకటి మరమ్మతులకు గురికాగా

మరొకటి ప్రారంభానికే నోచుకోలేదు

ఆవేదనలో మండలవాసులు

లక్కిరెడ్డిపల్లె, మే 25: మండలంలోని కోనంపేట, లక్కిరెడ్డిపల్లెలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉండడంతో ఈ రెండు ప్రాంతాల్లో పేదలకు శుద్ధి చేసిన నీటిని అందించాలనుకున్నారు. వెంటనే 2014లో అప్పటి ఎంపీ మైసూరారెడ్డి నిధులతో నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే లక్కిరెడ్డిపల్లెలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రం ద్వారా మూడేళ్లు పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో నీటిని ప్రజలకు అందించారు. ఆ తర్వాత మరమ్మతులకు గురికావడంతో దాన్ని పట్టించు కోలేదు. కానీ కోనంపేటలో నీటిశుద్ధి కేంద్రాన్ని అమర్చారే గానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా ఉండిపోయింది. దీంతో ప్రైవేటు నీటిశుద్ధి కేంద్రాల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉంది. బిందె నీరు రూ.10, క్యాను నీటిని రూ.15కు విక్రయిస్తున్నారు.

అంతేకాకుండా నీటిశుద్ధి కేంద్రంలోని ఎలక్ర్టానిక్‌ వస్తువులను, పైపులు, గుర్తు తెలియని దుండగలు తీసుకెళ్లినా పట్టించుకొనే నాథుడే లేరు. గతంలో లక్కిరెడ్డిపల్లెలో ఉన్న నీటి శుద్ధి కేంద్రం నుంచి బిందె నీరు రూ.2, క్యాన్‌ రూ.5తో అందరికీ శుద్ధి చేసిన నీటిని అందించేవారు. నీటి శుద్ధి కేంద్రం చెడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకొనే నాథుడే లేరని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులకు నోచుకోని నీటిశుద్ధి కేంద్రాలను మరమ్మతులు చేయించి మంచి నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

శుద్ధి చేసిన నీటిని ఒక్క రోజూ తాగలేదు

- నాగిరెడ్డి, కోనంపేట

అప్పటి ఎంపీ మైసూరారెడ్డి నిధులతో కోనంపేటలో నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కరోజు కూడా శుద్ధి చేసిన నీటిని గ్రామానికి అందించలేదు. ప్రారంభానికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికైనా అధికారులు నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తే అందరికీ ఉప యోగకరంగా ఉంటుంది.

Updated Date - 2023-05-25T23:41:25+05:30 IST