గాలి,వాన, వడగండ్ల బీభత్సం

ABN , First Publish Date - 2023-05-23T23:39:01+05:30 IST

ప్రకృతి అరటి రైతుపై కన్నెర్రజేసింది. నాలుగు రోజుల తిరక్కముందే మరోసారి పెనుగాలులకు తోడు వడగండ్ల వాన పడడంతో అరటి చెట్లు నేలవాలా యి.

గాలి,వాన, వడగండ్ల బీభత్సం
వెంకటరాజంపేట రోడ్డుపై పడ్డ భారీ వృక్షం

పది నిమిషాల్లో అరటికి కోట్ల నష్టం

వారంలో రెండో సారి నష్టపోయిన రైతులు

హైవేపై కూలిన భారీ వృక్షం

రాజంపేట టౌన్‌, పుల్లంపేట, మే23: ప్రకృతి అరటి రైతుపై కన్నెర్రజేసింది. నాలుగు రోజుల తిరక్కముందే మరోసారి పెనుగాలులకు తోడు వడగండ్ల వాన పడడంతో అరటి చెట్లు నేలవాలా యి. దీంతో అరటి రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంట, అందే దశలో అరటి దెబ్బతినడంతో రైతులు కోట్ల రూపాయల్లో నష్టపోయారు. నాలుగు రోజుల కిందట అనంతసముద్రం, రెడ్డిపల్లె పంచాయతీల్లో సుమారు 200 ఎకరాల్లో అరటిపంట దెబ్బతిని 2కోట్లకు పైగా నష్టం జరిగింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తూ పూర్తికాకముందే మరోసారి అరటిపంటకు నష్టం వాటిల్లింది. మంగళవారం సాయం త్రం 4గంటలకు 10నిమిషాల పాటు బలమైన గాలులు వీచాయి. ఆ తరువాత గంట పాటు వడగండ్లవాన కురిసింది.

దీంతో అనంతసము ద్రం, వత్తలూరు, అప్పయ్యరాజుపేట పంచాయతీల్లో అరటిపంట పూర్తిగా దెబ్బతినింది. ఒక్కో చోట చెట్లన్నీ సగానికి విరిగిపోయాయి. తిరుమలయ్యగారిపల్లెలో కావేటి తిరుపయ్యకు చెందిన సుమారు ఏడెకరాల అరటి తోట పూర్తిగా నేలమట్టమైంది. అప్పయ్యరాజుపేటలో దుర్గరాజుకు చెందిన మూడెకరాల అరటితోట దెబ్బతినింది. రెండో సారి వీచిన పెనుగాలులకు, వడగండ్ల వానకు 100 ఎకరాలకు పైగా నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఒకటిన్నర కోటికి పైగా నష్టపోయారు. అసలే కరోనాతో రెండేళ్ల పాటు పూర్తిగా నష్టపోయామని కోలుకునే దశలో మళ్లీ ప్రకృతి వైపరిత్యాలకు అరటి పంట దెబ్బతినడంతో రైతు లు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.

ఊటుకూరు వెంకటరాజంపేటలో...

రాజంపేట మండల పరిధి కడప-చెన్నై ప్రధాన రహదారిలో ఈదురుగాలులతో భారీ వృక్షం మం గళవారం సాయంత్రం కూలింది. దీంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. వెనువెంటనే గ్రామస్తు లు ఎక్స్‌కవేటర్‌తో వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. ఈదురుగాలుల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో అరటి, తమలపాకు తోటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన అరటిపంట నేలకొరగడం, ఆకుతోటలు నేలమట్టం కావడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆకు తోట 20 ఎకరాల్లో, 15ఎకరాల్లో అరటితోట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపిన సమాచారం బట్టి తెలుస్తోంది.

Updated Date - 2023-05-23T23:39:01+05:30 IST