Durga Temple: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి మహోత్సాల తేదీలు ఇవే...
ABN , First Publish Date - 2023-09-19T12:08:58+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల కోసం అధికారుల, పాలకమండలి సర్వం సిద్ధం చేశారు. ఆలయంలో ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్2కు 2.5 కోట్లు ఖర్చు చేసామని చెప్పారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల కోసం అధికారుల, పాలకమండలి సర్వం సిద్ధం చేశారు. ఆలయంలో ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్2కు 2.5 కోట్లు ఖర్చు చేసామని చెప్పారు. పలు దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరాకు వినియోగిస్తామని.. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు.
శవన్నవరాత్రి ఉత్సవాలు...
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయన్నారు. అక్టోబర్ 15న ఉత్సవాల తొలిరోజు శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.
16న శ్రీ గాయత్రీ దేవి అలంకారం
17న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
18న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
19న శ్రీ మహాచండీ దేవి అలంకారం
20న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం). అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
21న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం
22న శ్రీ దుర్గాదేవి అలంకారం
23న శ్రీ మహిషాసురమర్ధనీ దేవి అలంకారం... మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 200 మంది ఇతర దేవాలయాల నుంచి సిబ్బంది వస్తారని.. అన్ని శాఖల అధికారులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తారని చెప్పారు. కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్వైపు మార్చడం జరుగుతుందని కర్నాటి రాంబాబు వెల్లడించారు.
ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ.. వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయన్నారు. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయన్నారు. కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారన్నారు. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నామని.. జల్లు స్నానాలకు షవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయని.. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనంపై స్లాట్లు కూడా నిర్ణయిస్తామన్నారు. బడ్జెట్ రూ.7 కోట్లు అని.. గతంలో లాగానే భక్తుల రద్దీ ఆశిస్తున్నామన్నారు. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదని ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు.