కోడిపందాల జోరు... బహుమతులుగా బుల్లెట్‌లు, బైకులు, బంగారం

ABN , First Publish Date - 2023-01-14T21:14:06+05:30 IST

సంక్రాంతి సంప్రదాయాలకు పెట్టింది పేరుగా భావించే పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో భోగి పండుగ సందర్భంగా శనివారం కోడి పందేలు, వాటి వెనుక జూదాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి...

కోడిపందాల జోరు... బహుమతులుగా బుల్లెట్‌లు, బైకులు, బంగారం

భీమవరం: సంక్రాంతి సంప్రదాయాలకు పెట్టింది పేరుగా భావించే పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో భోగి పండుగ సందర్భంగా శనివారం కోడి పందేలు, వాటి వెనుక జూదాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుచోట్ల పెద్ద పెద్ద బరులు ప్రారంభించారు. ఇందులో భీమవరం (Bhimavaram) పట్టణ శివారున భారీ హైటెక్‌ బరి ఏర్పాటు చేశారు. కోడిపందేల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామంటూ నెల రోజులుగా పోలీస్‌శాఖ చేసిన హెచ్చరికలు, బరులను దున్నేస్తూ చేసిన హడావిడి, 2500 వరకు పెట్టిన పోలీసు కేసులు.. వందలాది సంఖ్యలో కోడి కత్తులను స్వాధీనం.. వంటివన్నీ శనివారం ఉదయం 10 గంటలతో తేలిపోయాయి. ముహూర్తం చూసుకుని 11 గంటల సమయానికి జిల్లాలో పెద్ద ఎత్తున పందేలు ప్రారంభమయ్యాయి.

ఆ శిబిరాలు పక్కనే జూదాలు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. ప్రతీ నియోజకవర్గంలో 10 వరకు బరులు ప్రారంభమయ్యాయి. జిల్లా మొత్తం మీద 100 పైగా బరులు తొలి రోజున శ్రీకారం చుట్టాయి. ఈసారి ఎక్కువ పందేలు గెలుచుకునే పుంజు యజమానులకు భారీ బహుమతులు ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో కైకలూరు (Kaikaluru), ఉండి నియోజకవర్గాల్లో కార్లు బహుమతిగా ప్రకటించారు. ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లోని బరులలో బుల్లెట్‌లు, మరికొన్ని నియోజకవర్గాల్లో మోటార్‌ సైకిళ్లు బహుమతులు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల బంగారాన్ని విజేతకు బహుమతిగా ఇస్తున్నారు.

భీమవరం శివారున హైటెక్‌ బరి

భీమవరం పట్టణ శివారున అతిపెద్ద కోడిపందేల వేదిక ఏర్పాటయింది. ఈ శిబిరంలో ఆధునిక వసతులు కల్పించారు. ఇక్కడ మూడు కారవాన్‌లు ఏర్పాటు చేశారు. జూద వేదికను హైటెక్‌ హంగులతో తీర్చిదిద్దినట్టు సమాచారం. కనీసం లక్షల్లో పందేలు వేసే వారే వచ్చే విధంగా నియమావళి అమలు చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలం సీసలి వద్ద, నరసాపురం నియోజకవర్గం యలమంచిలి మండలంలో, భీమవరం నియోజకవర్గం కొణితివాడలో పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. .

పొరుగు ప్రాంతాల నుంచి తాకిడి

పశ్చిమ గోదావరి జిల్లాకు అతిథులు ఎక్కువ మంది విచ్చేశారు. కోడిపందేల శిబిరాల వద్ద తొలి రోజున సందడి పెరిగింది. అత్యధికంగా పొరుగు ప్రాంతాల వారే ఉండడం కనిపించింది. ఉదయం నుంచి భారీగానే తరలివచ్చారు. ఎక్కువ మంది పందేలను చూడడానికి వచ్చినవారే ఉన్నారు. ప్రతీ బరి వద్ద ఆహార పదార్థాల దుకాణాలు, మద్యం బెల్డ్‌ షాపులు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-14T21:14:07+05:30 IST