భూ మేతలో కొత్త మలుపు!
ABN , First Publish Date - 2023-05-07T01:16:24+05:30 IST
తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో భూ బాగోతం కొత్త మలుపు తిరిగింది. తమకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన భూములను రెవెన్యూ అధికారులు రికార్డులను మార్చి అధికార పార్టీకి చెందిన నేతలకు అన్యాక్రాంతం చేశారని నిరుపేద దళితులు రాష్ట్ర భూ పరిపాలనా శాఖ కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు ఫిర్యాదు చేశారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో భూ బాగోతం కొత్త మలుపు తిరిగింది. తమకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన భూములను రెవెన్యూ అధికారులు రికార్డులను మార్చి అధికార పార్టీకి చెందిన నేతలకు అన్యాక్రాంతం చేశారని నిరుపేద దళితులు రాష్ట్ర భూ పరిపాలనా శాఖ కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు ఫిర్యాదు చేశారు. శనివారం సీసీఎల్‌కు గంపలగూడెం మండలం లింగాల రెవెన్యూ సొబ్బాల గ్రామానికి చెందిన దళిత నిరుపేద రైతులు సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్‌కు గోడు వెళ్లబోసుకోవటానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కార్యాలయంలో లేకపోవటంతో.. దళితులు ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పారు. భూ రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంలో స్థానిక రెవెన్యూ కార్యాలయ అధికారుల పాత్ర ఉందని, దీనిపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యాలయంలో ఫిర్యాదు ఇవ్వాలని, విచారణ జరిపిస్తానని సీసీఎల్‌ఏ చెప్పటంతో కార్యాలయంలో ఫిర్యాదు కాపీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్‌ను దళితులు కలిసి భూముల ట్యాంపరింగ్ అంశంపై ఫిర్యాదు చేశారు.
రికార్డుల ట్యాంపరింగ్‌పై విచారణ!
తిరువూరు ‘భూ మేత’ వ్యవహారంలో స్థానిక తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌వోలలో ఎవరి పాత్ర ఎంత అన్న దానిపై విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో పేర్ల మార్పులు, ఫిర్యాదుల విషయంలో సీసీఎల్‌ఏ సాయిప్రసాద్ సీరియ్‌సగా ఉన్నారు. తిరువూరు రెవెన్యూ డివిజన్ గంపలగూడెం మండలం, లింగాల రెవెన్యూ పరిధిలోని సొబ్బాల గ్రామంలో ఆర్‌ఎస్ నెంబర్ 164-1, 164-2లలో గొల్లమందల ముత్తయ్య పేరుతో 1972 నుంచి 2017 వరకు పాత అడంగల్ ఫసలీలో నమోదై ఉండటం.. 1986 లో రిజిస్ర్టేషన్ జరిగిందని తెరమీదకు తెచ్చిన డాక్యుమెంట్ ఆధారంగా ప్రైవేటు వ్యక్తి పేరుతో రెవెన్యూ అధికారులు రికార్డులు మార్చటం వెనుక పూర్వా పరాలపై జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ కూడా విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దళితులు మాత్రం 2018 వరకు సాగు లెక్కల్లో కూడా గొల్లమందల ముత్తయ్య పేరుతోనే ఉన్నదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పట్టాలు వస్తాయనుకుంటే.. ఆ భూమి కాస్తా అన్యాక్రాంతం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.