బెజవాడ మీదుగా అమృత్ భారత్
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:30 AM
సరికొత్త లుక్ , స్టైల్, స్పీడ్‌తో వస్తున్న అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి దశలోనే విజయవాడ మీదుగా రాకపోకలు సాగించనుంది.
సూపర్‌ఫాస్ట్ శ్రేణిలో సరికొత్త రైలు
నేడు ప్రధాని చేతులమీదుగా ప్రారంభం
విజయవాడ డి విజన్‌లో 10 స్టేషన్లలో హాల్ట్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సరికొత్త లుక్ , స్టైల్, స్పీడ్‌తో వస్తున్న అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి దశలోనే విజయవాడ మీదుగా రాకపోకలు సాగించనుంది. శనివారం ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభమవుతున్న రెండు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి ఏపీలో అడుగుపెట్టనుంది. విజయవాడ డివిజన్ పరిధిలో మాల్దాటౌన్-బెంగళూరు మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. రద్దీగా ఉండే నగరాలకు శరవేగంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ అమృత్‌భారత్ రైళ్లకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నూతన రైలు విజయవాడ డివిజన్‌లో 10 రైల్వేస్టేషన్లలో.. తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన డిజైన్‌తో కూడిన సీట్లు, లగేజీ ర్యాక్స్, మొబైల్ హోల్డర్స్‌తో కూడిన చార్జింగ్ పాయింట్లు, ఎల్‌ఈడీ లైట్లు, సీసీ టీవీలు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇది నాన్ ఏసీ స్లీపర్ కమ్ అన్ రిజర్వుడ్ క్లాస్ సర్వీస్. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలకు సేవలందించేలా రూపొందించబడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) నరేంద్ర ఆనంద్ పాటిల్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అమృత్‌భారత్ రైలు ప్రత్యేకతలను వివరించారు. అమృత్‌భారత్ రైలు అనేది 22 కోచ్‌లతో ఉంటుంది. ప్రమాదరహితమైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉంటాయన్నారు. రైల్లో 12 నాన్ ఎయిర్ కండీషన్డ్ స్లీపర్ క్లాస్, జనరల్ అన్ రిజర్వుడ్ క్లాస్ బోగీలు 8 చొప్పున ఉంటాయి.