వివేకా హత్య కేసులో నేరస్తులను అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2023-02-14T00:46:34+05:30 IST
పధకం ప్రకారమే వైఎస్. వివేకానందరెడ్డి హత్య జరిగిందని, హత్య కేసులో అసలు నేరస్తులను సీబీఐ అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ డిమాండ్ చేశారు.
వివేకా హత్య కేసులో నేరస్తులను అరెస్టు చేయాలి
టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్
పాయకాపురం, ఫిబ్రవరి 13 : పధకం ప్రకారమే వైఎస్. వివేకానందరెడ్డి హత్య జరిగిందని, హత్య కేసులో అసలు నేరస్తులను సీబీఐ అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ డిమాండ్ చేశారు. కండ్రికలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ సతీమణి భారతి సహాయకుడు నవీన్, జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డిల ఫోన్ల భాగోతాన్ని సీబీఐ బయటపెట్టినా సీఎం జగన్, భారతిలు ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్ధమవుతోందన్నారు. 70 ఏళ్ల వృద్ధుడు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వివేకాను మూడు గంటల పాటు చిత్ర హింసలు పెట్టి చంపారని విమర్శించారు. వివేకా హత్యకు రూ. 40 కోట్లు సుపారీ ఇచ్చే ఆర్థిక స్థోమత జైల్లో ఉన్న వారికి లేదని, హత్యతో పెద్దోళ్లకు సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. సీబీఐ దర్యాప్తులో ఇప్పుడు వేళ్లన్ని తాడేపల్లి ప్యాలెస్‌వైపు చూపిస్తున్నాయని, సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేయడంతో తమ్ముడు అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకోవాలో సీఎం జగన్‌కు పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. సీబీఐ అధికారులు అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేతలు పాల మాధవ, దాసరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.
జగనాసుర రక్త చరిత్ర పుస్తకావిష్కరణ
అజిత్‌సింగ్‌నగర్ : వివేకా హత్య కేసులో సూత్రధారులు ఎంత పెద్దవారైనా వారిని శిక్షించకపోతే రాష్ట్ర ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదని టీడీపీ నేత సాంబశివరావు పేర్కోన్నారు. సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో సోమవారం జగనాసుర రక్త చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీబీఐ హత్య కేసు విచారణ వేగవంతం చేసి సూత్ర, పాత్రధారులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. నేతలు ఘంటా కృష్ణమోహన్, దెందుకూరి మురళీకృష్ణంరాజు, గరిమెళ్ల చిన్నా, జైపాల్, రామారావు, సోమేశ్వరరావు, లబ్బా వైకుంఠం, పాల్గొన్నారు.