నకిలీ.. మకిలి!
ABN , First Publish Date - 2023-01-07T00:30:58+05:30 IST
నకిలీ పత్రాలతో ఫేక్ రిజిస్ర్టేషన్ల వ్యవహారం విస్ఫోటనంలా పేలుతోంది. గాంధీనగర్ ఉదంతం మరిచిపోకముందే గుణదల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో మరో రెండు ఫేక్ రిజిస్ర్టేషన్లు జరగటం చర్చకు దారితీసింది. తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేసి నకిలీ పొసెషన్ సర్టిఫికెట్ల తయారీ, ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేసి ఉపయోగించటం సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ రూరల్ తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
ఫేక్ డాక్యుమెంట్లతో దొంగ రిజిస్ర్టేషన్ యత్నం
రూ.1,500 కోట్ల మేర కాజేసే స్కామ్
ముందు స్వాధీనంలో చూపటం.. తర్వాత సేల్ డీడ్స్
తనఖాల దశలోనే బెడిసికొట్టిన ల్యాండ్ మాఫియా పన్నాగం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : చలసాని రవి అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తిని ఫేక్ డాక్యుమెంట్‌తో తనఖా రిజిస్ర్టేషన్ చేయించినట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండు ఫేక్ రిజిస్ర్టేషన్లకు సంబంధించిన ఆస్తి రూ.100 కోట్ల మేర ఉంటుందని సమాచారం. ఇలా చేసింది ఎవరు? వాస్తవాలు ఏమిటన్నది వెలుగుచూడాల్సి ఉంది. ఈ పరిణామంతో గుణదల సబ్ రిజిస్ర్టార్ అధికారులు అప్రమత్తమయ్యారు. వాటిని పరిశీలించి రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఫేక్ రిజిస్ర్టేషన్ వ్యవహారాలు బయటకు లీక్ చేసి పరువు తీయొద్దని సబ్ రిజిస్ర్టార్లకు ఉన్నతాధికారులు వార్నింగ్‌లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫేక్ రిజిస్ర్టేషన్లు జరిగిన మైలవరం, నున్న, పటమట, గాంధీనగర్, గుణదల, ఇబ్రహీంపట్నం తదితర సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల నుంచి సమాచారం బయటకు రావట్లేదు. విజయవాడ రూరల్ తహసీల్దార్ సంతకం ఫోర్జరీ అయినా రెవెన్యూ అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయటం లేదో అర్థంకాని విషయంగా ఉంది.
రూ.1,500 కోట్ల టార్గెట్
గాంధీనగర్‌తో పాటు గుణదల, పటమట, నున్న, మైలవరం, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు, జిల్లావ్యాప్తంగా పలు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో జరిగిన ఫేక్ రిజిస్ర్టేషన్ల ఆస్తుల విలువ రూ.1,500 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఎక్కడైతే ఆన్‌లైన్ కాకుండా మాన్యువల్ డాక్యుమెంట్లు ఉన్నాయో, వాటిని టార్గెట్‌గా చేసుకుని అచ్చుగుద్దినట్టు దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, కార్పొరేషన్లకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా నకిలీవి సృష్టిస్తున్నారు. ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ ఫేక్ డాక్యుమెంట్లన్నింటినీ చూపి దొంగ తనఖా రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. తనఖా రిజిస్ర్టేషన్లతో పాటు మార్ట్‌గేజ్‌లు చేస్తున్నారు. భూములకు సంబంధించి అసలైన వారికి తెలియకుండా మాఫియా బృందమే అందులోని సభ్యులు ఒకరికొకరు తనఖా రిజిస్ర్టేషన్ చేసుకుంటారు. ఈసీలో ఫలానా వ్యక్తికి తనఖా జరిగినట్టుగా కనిపిస్తోంది. ఇలా కనిపించటం వల్ల భూమి ఆ వ్యక్తి స్వాధీనంలో ఉందని అవతలి పార్టీకి తెలుస్తుంది. కాబట్టి వివాదం లేనిదని గుర్తించి ఆ భూమిని కొనటానికి ఆసక్తి చూపిస్తాడు. సరిగ్గా ల్యాండ్ మాఫియా దీనికోసమే పథకం వేసింది. ప్రస్తుతం తమ స్వాధీనంలో భూములు ఉన్నాయని చూపటం కోసమే తనఖా రిజిస్ర్టేషన్లు చేయించటం జరిగింది. ఆ తర్వాత తమ మాఫియా బృందంలోనే ఒకరికొకరు సేల్ డీడ్స్ జరుపుకొంటారు. ఇంకా ఈ ప్రక్రియ జరగలేదు. మొదటి రిజిస్ర్టేషన్ జరిగాక ఇక కథ ప్రారంభిస్తారు. ఈసీలో రీ-రిజిస్ర్టేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి కొనుగోలు చేసే వాడిని తేలిగ్గా బురిడీ కొట్టిస్తారు. ఆ భూమిని అమ్మకానికి పెడతారు. డబ్బు పుచ్చుకుని రిజిస్ర్టేషన్ చేస్తారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కానీ తాము మోసపోయామని బాధితులకు తెలుస్తుంది. అసలు భూ యజమానులు, కొనుక్కున్న భూ యజమానులు ఘర్షణ పడి కోర్టులకు చేరతారు. ఇలాంటి వ్యవహారాల్లో ఈ మాఫియా మాత్రం ఎదురుదాడి చేస్తుంది. అదేమంటే.. వాస్తవ యజమానే ఎవరి దగ్గరో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ర్టేషన్ చేయించుకున్నాడని కథ రక్తి కట్టిస్తారు. ఉభయులు గొడవలు పడి కోర్టుల్లో తేల్చుకోడానికి ఏళ్ల సమయం పడుతుంది. ఈలోపు ల్యాండ్ మాఫియా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. తొలిదశలో జరిగిన రిజిస్ర్టేషన్ల ప్రకారం చూస్తే ల్యాండ్ మాఫియా టార్గెట్ రూ.1,500 కోట్లుగా తె లుస్తోంది.
కలెక్టర్ విచారణ
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో ఫేక్ రిజిస్ర్టేషన్ల వ్యవహారాలు వెలుగు చూడటంతో కలెక్టర్ దిల్లీరావు అప్రమత్తమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా డీఆర్‌ను పిలిచి ప్రాథమిక వివరాలు తెలుసుకున్నారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో జరిగిన ఫేక్ రిజిస్ర్టేషన్ల వ్యవహారాల గురించి ఆరా తీశారు. ఆధార్ కార్డులను కూడా మార్ఫింగ్ చేసినట్టుగా కలెక్టర్‌కు వివరించారు.