శక్తి చైతన్యానికి ప్రతీక హనుమంతుడు..

ABN , First Publish Date - 2023-05-15T00:59:43+05:30 IST

యువతలో కార్యదీక్ష, సంకల్ప సిద్ధికి శౌర్య, ధైర్య పరాక్రమాలు నింపి సమాజానికి ఉపయోగపడే రీతిగా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు పలువురు వక్తలు పేర్కొన్నారు. విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ విజయవాడ మహానగర్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ శోభాయాత్ర, బైక్‌ర్యాలీ ఆదివారం సత్యనారాయణపురం రామకోటి బీఆర్టీఎస్‌ రోడ్డులో ప్రారంభమైంది.

శక్తి చైతన్యానికి ప్రతీక హనుమంతుడు..
జంక్షన్‌లో భక్తులకు దర్శనమిచ్చిన అభయాంజనేయస్వామి

సత్యనారాయణపురరం/హనుమాన్‌జంక్షన్‌, మే 14 : యువతలో కార్యదీక్ష, సంకల్ప సిద్ధికి శౌర్య, ధైర్య పరాక్రమాలు నింపి సమాజానికి ఉపయోగపడే రీతిగా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు పలువురు వక్తలు పేర్కొన్నారు. విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ విజయవాడ మహానగర్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ శోభాయాత్ర, బైక్‌ర్యాలీ ఆదివారం సత్యనారాయణపురం రామకోటి బీఆర్టీఎస్‌ రోడ్డులో ప్రారంభమైంది. సోమువీర్రాజు, శివస్వామిలు బైక్‌ ర్యాలీని ప్రారంభించగా పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, హనుమంతుడు శక్తి, చైతన్యానికి ప్రతీక అని, ఆయన పేరు తలుచుకుంటేనే తెలియని చైతన్యం ఉప్పొంగుతుందన్నారు. యువతరం హనుమంతుని ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని సాధించాలన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. జైహనుమాన్‌, జై భజరంగభళి, భారత్‌మాతాకు జై నినాదాలతో ర్యాలీ బీఆర్టీఎస్‌రోడ్డు నుంచి పడవలరేవు, మాచవరం ఆంజనేయస్వామిగుడి, చుట్టగుంట, పోలీసు కంట్రోల్‌రూం మీదుగా, వినాయకుడి గుడి, దుర్గగుడి, పాలఫ్యాక్టరీ వరకు సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, శైవక్షేత్రం పిఠాధిపతి శివస్వామి, భక్తిచైతన్యనందస్వామి, హనుమత్‌దీక్షాపీఠం దుర్గాప్రసాద్‌ స్వామీజీ, మహానగర్‌ అధ్యక్షుడు సానా శ్రీనివాస్‌, శ్రీనివాసరెడ్డి, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాఘవరాజు, అవుటుపల్లి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌ జంక్షన్‌లో..

అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి దర్శనానికి ఉదయం 4 గంటల నుంచే భక్తులు బారులుతీరారు. తెల్లవారుజామున అభయాంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పట్టువస్ర్తాలు, తమలపాకులు, పూలతో అలంకరించారు. రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ల లక్ష్మి, విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు, తదితరులు అభయాంజనేయ స్వామిని దర్శించారు. లారీ ట్రాన్స్‌పోర్టర్‌ కనుమూరి సూర్యనారాయణ రాజు వేలేరు మహా అన్నప్రసాదం వద్ద భక్తుల సందర్శనార్ధం రూ.3లక్షలతో తయారు చేయించిన మూడు అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేశారు. భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయ పాలక మండలి చైర్మన్‌ నెరుసు నాగభూషణం, దెందులూరు ఏఎంసీ చైర్మన్‌ అప్పన కనక దుర్గా ప్రసాద్‌, ఈవో కె.శ్రీనివాస్‌, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.సత్యసాయి సేవా సమితి సభ్యులు, పలు భజన సమాజం సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూజివీడు రోడ్డులోని ఏపూరు 40 అడుగుల దాసాంజనేయస్వామి ఆలయంలో 73వ హనుమాన్‌జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 17 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-05-15T01:00:07+05:30 IST