‘‘మోతా’దుకు మించి..

ABN , First Publish Date - 2023-04-17T01:03:36+05:30 IST

డుగ్‌డుగ్‌డుగ్‌ అంటూ బాంబులు పేలిన శబ్దాలతో బుల్లెట్లు ఓవైపు.. కుయ్‌కుయ్‌మంటూ వీఐపీ హారన్లతో సాధారణ కార్లు మరోవైపు.. ప్రశాంతమైన రహదారుల్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అవసరమున్నా లేకున్నా మోగిస్తున్న ఈ అనధికారిక హారన్లతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతుండగా, ట్రాఫిక్‌ పోలీసులు కూడా అంబులెన్సులో, ఇతర వీఐపీ వాహనాలోనని గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. నగరంలో బాగా ఎక్కువైన ఈ కల్చర్‌ ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

‘‘మోతా’దుకు మించి..

ప్రమాదకరంగా పెరిగిపోతున్న నయా కల్చర్‌

భయాందోళన కలిగించే సైరన్లతో బుల్లెట్ల హడావుడి

అనధికారిక వీఐపీ హారన్లతో తిరుగుతున్న కార్లు

బరితెగించి ప్రమాదాలకు కారణమవుతున్న యువత

ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలు శూన్యం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : వాహనదారులు ఎవరి మార్గంలో వారు వెళ్తుంటారు. ఉన్నట్టుండి ఏదో పేలిన శబ్దం వినిపిస్తుంది. ఒక్కసారి గుండెజారినంత పనవుతుంది. వాహనదారులు తేరుకుని చూస్తే అక్కడేమీ కనిపించదు. ఒక బుల్లెట్‌ మాత్రం వేగంగా వెళ్లిపోతుంది. ట్రాిఫిక్‌లో తమకు మార్గం సుగమం చేసుకోవడానికి కొంతమంది ఆకతాయిలు వేస్తున్న ఎత్తులివి. వారి చేష్టలతో నగరంలో శబ్ద కాలుష్యాన్ని పెంచడమే కాకుండా తోటి వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఈ వెకిలి చేష్టలకు దిగుతున్నారు.

బుల్లెట్లతో భయం భయం

ప్రస్తుతం బుల్లెట్‌ వాడకం రాయల్టీకి సింబల్‌గా మారిపోయింది. స్థాయితో సంబంధం లేకుండా బుల్లెట్లను కొంటున్నారు. షోరూంల్లో మామూలుగా ఉన్న బుల్లెట్లు బయటకు రాగానే మేకప్‌ వేసుకుంటున్నాయి. కంపెనీ తయారీ సమయంలో ఇచ్చిన సైలెన్సర్లను తొలగిస్తున్నారు. వాటి స్థానంలో ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లు అమరుస్తున్నారు. రహదారులపై వెళ్లేటప్పుడు వాహనాలు కానీ, పాదచారులు కానీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బుల్లెట్లతో బాంబు పేలినట్టు శబ్దాలు చేస్తున్నారు. చిన్నచిన్న వీధుల్లోనూ ఈ శబ్దాలు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. బుల్లెట్లను వేగంగా నడుపుతూ మధ్యలో పవర్‌ బటన్‌ ఆఫ్‌ చేసి ఆన్‌ చేస్తున్నారు. దీనికితోడు ఒక్కసారిగా ఇంజన్‌ ఆఫ్‌లోకి వెళ్లి ఆన్‌లోకి వస్తుంది. ఈ సమయంలో సైలెన్సర్‌ నుంచి పెద్ద పేలుడు శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దానికి జనం భయపడే పరిస్థితి వస్తోంది. కొన్నాళ్ల క్రితం యువత బుల్లెట్లతో నగర రహదారులపై ఇలాగే నానా హంగామా సృష్టించారు. ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లను తొలగించారు. స్వరాజ్య మైదానంలో రోలర్‌తో వాటిని తొక్కించేశారు. ఆ తర్వాత ఈ శబ్దాలు తగ్గుముఖం పట్టాయి. కొన్నాళ్లపాటు ఆగినట్టే ఆగిన యువత మళ్లీ పాత పద్ధతికి వెళ్తున్నారు. ఈ శబ్దాలకు చిన్నపిల్లలు, వృద్ధులు, హృద్రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

కారు కూతలతో కన్ఫ్యూజన్‌

అంబులెన్స్‌ల సైరన్‌ ఒకలా ఉంటుంది. మంత్రులకు ఎస్కార్ట్‌ ఉన్న పోలీసు వాహనాలకు మరో సైరన్‌ ఉంటుంది. ఇదికాకుండా వివిధ పదవులు, హోదాల్లో ఉన్న వ్యక్తుల కార్లకు సైరన్‌ ఉంటుంది. ఆ వాహనంలో వీఐపీ ఉన్నారని తెలియడం కోసం డ్రైవర్లు ఈ సైరన్‌ మోగిస్తుంటారు. ఇది కుయ్‌కుయ్‌మంటుంది. ఇప్పుడు ఈ సైరన్‌ ఎలాంటి హోదాలు, పదవులు లేని వ్యక్తులూ ఉపయోగిస్తున్నారు. హారన్‌కు బదులుగా కుయ్‌కుయ్‌మనే సైరన్‌ మోగిస్తున్నారు. ముఖ్యంగా దీన్ని జంక్షన్లలో ట్రాఫిక్‌ రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు, రహదారులపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మోగిస్తున్నారు. ఈ సైరన్లతో ట్రాఫిక్‌ పోలీసులూ గందరగోళానికి గురవుతున్నారు. ట్రాఫిక్‌ జంక్షన్‌ వద్ద వాహనాల మధ్యలో ఇరుక్కున్నప్పుడు ఈ సైరన్‌ మోగిస్తున్నారు. అందులో ఎవరో వీఐపీ ఉన్నారన్న భావనలో పోలీసులు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. నగరంలో అటు బుల్లెట్‌ శబ్దాలు, ఈ కారు కూతలు మిగిలిన వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

చర్యలు తీసుకుంటున్నాం..

బుల్లెట్ల సైలెన్సర్లు మారుస్తున్నా, పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ డ్రైవింగ్‌ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. జరిమానాలు విధిస్తున్నాం. కార్లకు ప్రత్యేకంగా ఒక సైరన్‌ ఏర్పాటు చేసుకుని తిరుగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. అనధికారికంగా ఎవరైనా అలా తిరిగితే ప్రజలు మాకు ఫిర్యాదు చేయవచ్చు. - సర్కార్‌, ట్రాఫిక్‌ ఏడీసీపీ

Updated Date - 2023-04-17T01:03:36+05:30 IST