రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ABN , First Publish Date - 2023-02-14T01:04:47+05:30 IST
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈనెల 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ అధికారులు రంగం సిద్ధం చేశారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు విజయవాడ డివిజన్‌లో 103, కృష్ణా డివిజన్‌లో 83 కేంద్రాల్లో జరగనున్నాయి.
122 పరీక్షా కేంద్రాల్లో 60 వేల మంది విద్యార్థులు
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 13 : ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈనెల 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ అధికారులు రంగం సిద్ధం చేశారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు విజయవాడ డివిజన్‌లో 103, కృష్ణా డివిజన్‌లో 83 కేంద్రాల్లో జరగనున్నాయి. ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు విజయవాడ డివిజన్‌లో 6, కృష్ణా రూరల్ పరిధిలో 30 కేంద్రాల్లో జరగనున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో 20,147 మంది ఎంపీసీ, 23,091 మంది బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో ఫస్టియర్‌లో 376, సెకండియర్‌లో 399 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరవుతున్నారు. కృష్ణా డివిజన్‌లో ఎంపీసీ 9735, బైపీసీ 4016 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఒకేషనల్ విద్యార్థులు విజయవాడ డివిజన్ పరిధిలో ఫస్టియర్ 1427, సెకండియర్ 1370 మంది హాజరవుతున్నారు.
థియరీ పరీక్షలకు 60,147 మంది
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 430 కళాశాలలకు చెందిన 60,147 మంది విద్యార్థులు థియరీ పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు 430 కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో 166, కృష్ణా డివిజన్ పరిధిలో 204 కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరు కానున్నారు.
జంబ్లింగ్ విధానంలో థియరీ పరీక్షలు
జంబ్లింగ్ విధానంలో థియరీ పరీక్షలు జరుగుతాయని, ప్రాక్టికల్ పరీక్షలు ల్యాబ్‌లు ఎక్కువగా ఉండే కళాశాలల్లో నిర్వహిస్తున్నామని ఆర్‌ఐవో రవికుమార్ తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హాజరు కావాల్సి ఉందని, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు రాయవలసి ఉంటుందని, కృష్ణా డివిజన్ పరిధిలో 19,506 మంది ఎన్విరాన్‌మెంట్ పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు.