Pawan Wishes: ‘ఇంతటి మహోన్నతమైన స్త్రీకి ఏమిస్తే రుణం తీరుతుంది’

ABN , First Publish Date - 2023-03-08T10:45:25+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపడుచులందరికీ జనసేన అధినేత పవన్‌ కళ్యాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Pawan Wishes: ‘ఇంతటి మహోన్నతమైన స్త్రీకి ఏమిస్తే రుణం తీరుతుంది’

అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా ఆడపడుచులందరికీ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ప్రెస్‌నోట్ విడుదలైంది. ‘‘శక్తి స్వరూపిణి స్త్రీ.. బహుకృత రూపిణి స్త్రీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ.. మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ.. ఇంతటి మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుంది. తల్లిగా.. తోబుట్టువుగా.. భార్యగా.. బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెల కట్టలేనివి. మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిది. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అని తెలియజేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పుకొంటుంటామని.. అది సత్యమన్నారు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయని తాను ధృడంగా విశ్వసిస్తానని జనసేన అధినేత తెలిపారు.

అయితే స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. స్త్రీ ఆర్థిక స్వావలంబనతో స్వశక్తిపై నిలబడలన్నా, సాధికారిత సాధించాలన్నా చట్ట సభలలో వారి సంఖ్యా బలం పెరగవలసి ఉందని తాను ప్రగాఢంగా నమ్ముతానన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనసేన డిమాండ్ చేయడంతో బాటు ఈ అంశాన్ని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామని చెప్పారు. ఈ దిశగా తన రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుందని తెలిపారు. మహిళామణులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-03-08T10:45:25+05:30 IST