పోలీస్‌, పొలిటికల్‌ మాయ.. భూ మాఫియా

ABN , First Publish Date - 2023-02-13T00:41:35+05:30 IST

రూ.కోట్ల విలువైన భూములు.. ఖాళీగా కనిపిస్తే కబ్జా చేసేసే తెలివితేటలు.. ఇందుకు ఖాకీలు.. ఖద్దరు నాయకుల సహకారాలు.. ఇంకేముంది ఉమ్మడి కృష్ణాజిల్లాలో భూ మాఫియా చెలరేగిపోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం, ఇదేంటని బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం, తెరవెనుక వైసీపీ నేతలు చక్రం తిప్పడంతో పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. అసలు యజమానులు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతుండగా, కబ్జారాయుళ్లు మాత్రం దర్జాగా కాలర్‌ ఎగరేస్తున్నారు.

పోలీస్‌, పొలిటికల్‌ మాయ.. భూ మాఫియా

ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఖరీదైన భూములకు ఎసరు

పామర్రులో మాజీ ఎమ్మెల్యే భూమికే ఎసరు

తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినా చర్యల్లేవ్‌

అక్రమార్కుల అరెస్టుకు అడ్డుపడుతున్న గుడివాడ ఎమ్మెల్యే

పెనమలూరులో కమ్మిలి రంగనాథ్‌ నేతృత్వంలో ఫోర్జరీ ముఠా

తాడిగడపలో రూ.10 కోట్ల విలువైన భూమికి నకిలీ పత్రాలు

వైసీపీ నేతల ఒత్తిళ్లతో చర్యలకు పెనమలూరు పోలీసులు నో

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : వైసీపీ నేతలు, పోలీసుల అండతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూమాఫియా చెలరేగిపోతోంది. ఫోర్జరీ సంతకాలతో ఖరీదైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించడం, వాటి ఆధారంగా వాటిని ఇతరులకు అమ్మేయడం లేదా కబ్జా చేయడమే పనిగా భూదందాలు సాగిస్తున్నారు. భూ యజమానుల సంతకాలనే కాకుండా ఏకంగా అధికారుల సంతకాలనూ ఫోర్జరీ చేసేసి భూములను అమ్మేస్తుండటం ఈ భూ మాఫియా దందాలకు పరాకాష్ట. ఫోర్జరీ అని స్పష్టంగా నిరూపించినా పోలీసులు మాత్రం భూ మాఫియాతో ములాఖత్‌ అయి కేసులను నీరుగారుస్తున్నారు. పోలీసుల ఉదాసీనత.. వైసీపీ నేతల ఉదారత.. వెరసి అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినా..

పామర్రుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి, మాజీ ఎమ్మెల్యే తమ్మా కోటమ్మరెడ్డికి చెందిన ఆస్తి ఆయన కుమారుడు వినోద్‌రెడ్డికి వారసత్వంగా సంక్రమించింది. ఇందులో పామర్రు బ్యాంకు కాలనీలో ఉన్న సుమారు 46 సెంట్ల భూమి కూడా ఉంది. ఈ భూమిపై కన్నేసిన భూ మాఫియా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వారికి విక్రయించేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించే క్రమంలో భూ యజమానుల సంతకాలతో పాటు పామర్రు తహసీల్దార్‌ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. దీనికి మండలానికి చెందిన ఓ మహిళా వీఆర్వోతో పాటు రెండు చానళ్ల విలేకరులు కూడా సహకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై అటు తహసీల్దార్‌తో పాటు భూ యజమాని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి పక్షం రోజులపైనే గడుస్తున్నా పోలీసులు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఒత్తిడితోనే ఈ కేసు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

పెనమలూరులో ఫోర్జరీ ముఠా

పెనమలూరు కేంద్రంగా ఓ ఫోర్జరీ ముఠా ఖరీదైన భూములపై కన్నేసింది. విజయవాడ నగరం చుట్టుపక్కల వేగంగా పెరుగుతున్న రియల్‌ భూమ్‌ను ఆసరాగా చేసుకుని నకిలీ దస్తావేజులతో ఖరీదైన భూములపై ఈ ముఠా కన్నేసింది. ఈ ముఠాకు కమ్మిలి రంగనాథ్‌ అనే వ్యక్తి సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఇతనిపై మెడికల్‌ సీట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ ముఠా నగరానికి చెందిన ఓ వైసీపీ నేత సహకారంతో తాడిగడపలోని సుమారు రూ.10 కోట్ల భూమిపై కన్నేసింది. భూ యజమానికి తెలియకుండా నకిలీ విక్రయ అగ్రిమెంట్‌ను సృష్టించి, యజమానిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించింది. ఈ మాఫియాకు ఎన్టీఆర్‌ జిల్లా జేసీ కార్యాలయంలోని కొందరు వ్యక్తులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్లాక్‌మెయిల్‌ దందాపై భూ యజమాని పెనమలూరు పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా సూత్రధారులపై చర్యలు తీసుకోలేకపోయారు. విజయవాడ నగరానికి చెందిన ఓ వైసీపీ నేత ఈ ముఠాకు సహకరిస్తున్న కారణంగానే పోలీసులు కేసును నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

బాధితులు అనేకమంది

ఈ భూమాఫియా బాధితులు నగరంలో చాలామందే ఉన్నారు. ఇటీవల నకిలీ దస్తావేజులు, ఆధార్‌ కార్డులతో వేరే వారి భూములను అమ్మేసుకున్న ముఠా సభ్యులైన తిరుమణిరాజు చైతన్య, మేర వెంకటేశ్వరరావు తదితరులతో కలిసి ఈ ముఠా పలువురి భూములకు నకిలీ దస్తావేజులు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2023-02-13T00:41:36+05:30 IST