గుడివాడలో పచ్చజెండా ఎగరేద్దాం
ABN , First Publish Date - 2023-12-11T01:29:11+05:30 IST
‘ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేద్దాం.. కొడాలి నానిని బొంద పెడదాం.. ఇదే మన నినాదం.. అదే మన విధానం..’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గుడ్లవల్లేరు, డిసెంబరు 10 : ‘ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేద్దాం.. కొడాలి నానిని బొంద పెడదాం.. ఇదే మన నినాదం.. అదే మన విధానం..’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి గుడ్లవల్లేరులో టీడీపీ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవీంద్ర మాట్లాడుతూ, చంద్రబాబు గుడివాడ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రావి వెంకటేశ్వరరావు కష్టకాలంలో పార్టీకి ఎంత చేశారో అందరికీ తెలుసు. ఆయన సామర్ధ్యాన్ని ఏస్థాయిలోనూ తక్కువ చేయడంలేదు.. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థిని బలంగా ఢీ కొట్లాలని, గుడివాడలో ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ గెలవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా గుడివాడ ఇన్చార్జ్గా వెనిగండ్ల రామును నియమించామన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి లిస్టులోనే రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని రవీంద్ర చెప్పారు. ఇలానే ప్రతీసారీ రావిని పార్టీ మోసం చేస్తూనే వచ్చిందని రవీంద్రను కార్యకర్తలు నిలదీయగా.. రవీంద్ర స్పందిస్తూ స్టాంప్ పేపర్‌పై రాసిస్తాననీ, రావికి మరోసారి అన్యాయం జరిగితే రాజీనామా చేసి రావికి అండగా నిలుస్థానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
రాక్షసుని అంతమొందిద్దాం : రావి
వందల కోట్లు ప్రజా ధనాన్ని దిగమింగిన రాక్షసుడిని అంతమొందించి గుడివాడలో టీడీపీ జెండా ఎగురవేద్దాం.. అని రావి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. దుష్ప్రచారాలు చేయడమే నానికి అలవాటు.. అతని ఎత్తుగడలను తిప్పికొడదాం.. అని వెనిగండ్ల రాము అన్నారు. రావికి కార్యకర్తల పట్ల ఉన్న ప్రేమ, ఆయన పై కార్యకర్తలకు ఉన్న అభిమానాన్ని చూశా.. అదే ప్రేను తనకూ ఉందని.. రాబోయే రోజుల్లో చూస్తారని అన్నారు. రావి త్యాగానికి రుణపడి ఉంటానన్నారు.
కొసరాజు బాపయ్య చౌదరి మాటే శిరోధార్యం : కొల్లు రవీంద్ర, రాము
తొలుత గుడ్లవల్లేరు పార్టీ ముఖ్య నేతలతో రవీంద్ర, రావి, రాములు సమావేశమయ్యారు. ఆ సమయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కొసరాజు బాపయ్య చౌదరిని చిన్నచూపు చూస్తే సహించబోమని తామంతా రాజీనామాలు చేస్తామని రాజీనామా లేఖలను రవీంద్రబకు ఇవ్వబోయారు. బాపయ్య చౌదరి వారిని వారించి తనను ఎవ్వరూ చిన్న చూపు చూడలేదని, అందరం పార్టీ కోసం పనిచేద్దామని, పార్టీ గెలుపే లక్ష్యం అని నాయకులకు సర్ధి చెప్పారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మండలంలో బాపయ్య చౌదరి మాటే శిరోధార్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి, గుడివాడ టౌన్ పార్టీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, నందివాడ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు వల్లభనేని బాబూరావు, జంగం మోహనరావు, శాయిన పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.