మట్టి కొట్టేస్తున్నారు
ABN , First Publish Date - 2023-01-11T00:56:34+05:30 IST
పెడన నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఎంచుకుని మరీ అధికార పార్టీ నాయకులు మట్టిని తరలిస్తున్నారు. చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. మంత్రి అండ చూసుకుని జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలను అధికారులు కూడా అడ్డుకోలేక పోతున్నారు.
మంత్రి అండతో అనుచరులు, బంధువుల దోపిడీ
గూడూరు మండలంలో మట్టి రవాణాకు రూ.80 లక్షల కప్పం
పెడన మండలంలో 14.40 ఎకరాల ప్రభుత్వ భూమిలో చెరువుల తవ్వకం
అంతా మంత్రి అనుచరుల కనుసన్నల్లోనే..
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : పెడన మండలం మడక, బల్లిపర్రు గ్రామాల్లోని కుమ్మరుల జీవనం కోసం సర్వే నెంబరు 62 నుంచి 67లోని 14.40 ఎకరాల భూమిలో మట్టి తవ్వి తీసుకునేందుకు 1950వ సంవత్సరంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం కుమ్మరుల వృత్తి దాదాపుగా నిలిచిపోవడంతో ఈ భూమి ఖాళీగా ఉంటోంది. రెవెన్యూ రికార్డుల్లో డ్రెయినేజీ విభాగానికి చెందిన భూమిగా నమోదై ఉంది. ఇటీవల కాలంలో ఈ భూమిపై కన్నేసిన పెడనకు చెందిన అధికార పార్టీ నాయకులు చెరువుల తవ్వకం పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం యంత్రాలను తీసుకొచ్చి అర్థరాత్రి సమయంలో చెరువు తవ్వకం పనులను ప్రారంభించారు. మడక గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు రాత్రి సమయంలో సంఘటనా స్థలానికి వెళ్లి చెరువు తవ్వకం పనులను నిలిపివేశారు. కాగా, ప్రభుత్వ భూమిని చెరువులుగా మార్చి తమ సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు తెరవెనున మంత్రాంగం నడుపుతున్నారని, అడ్డుకుంటామని మడక గ్రామస్థులు చెబుతున్నారు.
స్పందనలో ఫిర్యాదు
కప్పలదొడ్డిలో అక్రమంగా మట్టి తవ్వకాలు, విక్రయాలపై జనసేన నాయకులు సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై కలెక్టర్ విచారణకు అదేశించారు. మైనింగ్ విభాగం అధికారులు మంగళవారం కప్పలదొడ్డిలో జరుగుతున్న మట్టి తవ్వకాలను పరిశీలించి వెళ్లారు. అయినా తవ్వకాలు ఆపలేదు. బంటుమిల్లి మండలం రామవరపుమోడి గ్రామం నుంచి పెద్దఎత్తున మట్టిని తరలిస్తుండటంతో ఇటీవల టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాగా, మట్టి రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయినా మట్టి తవ్వకం, రవాణా ఇక్కడి నుంచి నిత్యం జరుగుతూనే ఉంది. పెడ న నియోజకవర్గంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాలకు మట్టి రవాణాకు ధరలు నిర్ణయించి, తనను ప్రసన్నం చేసుకున్న వారికి మంత్రి అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ వైపునకు కన్నెత్తి చూడొద్దని అధికారులకు హెచ్చరికలు కూడా వస్తున్నాయి.
కప్పలదొడ్డిలో అసైన్డ్ భూముల్లో మట్టి తవ్వకాలు
గూడూరు మండలం కప్పలదొడ్డిలో పది రోజులుగా మట్టి తవ్వకాలు ఊపందుకున్నాయి. గ్రామంలోని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిలో మట్టిని మంత్రి బంధువు ఒకరు అక్రమంగా తరలించుకుపోతున్నారు. వేసవికాలం పూర్తయ్యే నాటికి గూడూరు మండలం నుంచి మట్టి రవాణాకు రూ.80 లక్షలను కప్పంగా కట్టానని, తనకు మంత్రి అండదండలున్నాయని సదరు వ్యక్తి బాహాటంగానే చెబుతున్నాడు. ఇక్కడి నుంచి మట్టిని తవ్వి విక్రయాలు జరపడం గమనించదగ్గ అంశం. మట్టి తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే వెంటనే మంత్రి ద్వారా ఫోన్‌లు చేయిస్తున్నారు.