జగన్‌పై వ్యతిరేకత.. బాబుకు ప్రజాదరణ
ABN , First Publish Date - 2023-04-12T00:54:45+05:30 IST
జగన్‌రెడ్డి ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా రాష్ట్రం భ్రష్టు పట్టి పోయింది.. అభివృద్ధి కనుమరుగైంది.. అందుకే ప్రజలు తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు.. అంటూ టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బోడె ప్రసాద్ పేర్కొన్నారు.

పెనమలూరు/మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 11 : జగన్‌రెడ్డి ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా రాష్ట్రం భ్రష్టు పట్టి పోయింది.. అభివృద్ధి కనుమరుగైంది.. అందుకే ప్రజలు తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు.. అంటూ టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బోడె ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం పోరంకి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనపై వారు మాట్లాడారు. ఒక్క చాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్‌రెడ్డి రాష్ర్టాన్ని అన్నివిధాలా భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తారు. వైసీపీ మోసాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పర్యటనలు సక్సెస్ కావడాన్ని బట్టి జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో అర్ధమవుతుందన్నారు. గన్నవరం ఘటనలో టీడీపీ కార్యాలయంపై దాడులు చేసి కార్లు ధ్వంసం చేస్తే తిరిగి మాపైనే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నాయకురాలు తన తల్లికి ఆరోగ్యం బాగలేక పరామర్శించేందుకు వస్తే పోలీసులు ఆమెను కనీసం దుస్తులు మార్చుకోవడానికి కూడా అనుమతించకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బుధవారం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పెనమలూరు చెక్‌పోస్టు వద్ద ఉన్న వెలగపూడి శంకరబాబు కోల్డ్‌స్టోరేజీ నుంచి ఉయ్యూరు వరకు బైక్ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించాన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, కొనకళ్ల బుల్లయ్య, గొట్టిపాటి వెంకట రామకృష్ణప్రసాద్, మారుపూడి ధనకోటేశ్వరరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, అంగిరేకుల మురళి, కోయ ఆనందప్రసాద్, శొంఠి శివరాంప్రసాద్, పీతా గోపిచంద్, సంగెపు రంగారావు, అశోక్, మన్నే వాసు, ఆచంట వెంకటచంద్ర తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు సభంటే వైసీపీకి దడ : రవీంద్ర
చంద్రబాబు సభంటే వైసీసీ నాయకులకు దడపుట్టుకొస్తోందని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం హిందూకళాశాలలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మీడియా కో-ఆర్డినేటర్ చిట్టిబాబు, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. జగన్‌రెడ్డి పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. చంద్రబాబును స్వాగతించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారన్నారు.
చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు..
బుధవారం చంద్రబాబునాయుడుకు మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్, కోనేరుసెంటర్, హిందూ కళాశాల వద్ద ప్రజలు పూల దండలతో స్వాగతం పలుకుతారన్నారు. బచ్చుపేట వేంకటేశ్వరస్వామి గుడి వద్ద వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారన్నారు. బచ్చుపేటలో ఆక్వా రైతులు, పేదలు తమ సమస్యలపై చంద్రబాబుకు వినతి పత్రాలు సమర్పిస్తారన్నారు. దివ్యాంగులను చంద్రబాబు పలుకరిస్తారన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో టీడీపీ కార్పొరేటర్ మరకాని సమతాకీర్తి, చిత్తజల్లు నాగరాము, నాయకులు అక్కుమహంతి రాజా, పంచపర్వాల కాశీవిశ్వనాథం, కరెడ్ల సుశీల, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు.
అభయాంజనేయుడి ఆశీస్సులతో..
హనుమాన్‌జంక్షన్ : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన విజయవంతం కావాలని మంగళవారం అభయాంజనేయస్వామి ఆలయంలో మాజీ ఎంపీ మాగంటి బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్క చాన్స్ అని గద్దెనెక్కిన వైసీపీకి ఈసారి డిపాజిట్లు కూడా రావన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతీకారం తప్పదన్నారు. అప్పుడు ఈ జైళ్లు చాలవన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం మాగంటికి ఆలయపాలక మండలి చైర్మన్ నెరుసు నాగభూషణం స్వామి చిత్రపటాన్ని అందజేశారు. బాపులపాడు మండల అధ్యక్ష కార్యదర్శులు దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, పట్టణ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సభను విజయవంతం చేయాలి : బుద్దా
అవనిగడ్డ టౌన్ : మచిలీపట్నంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని శాసనమండలి మాజీ సభ్యుడు బుద్దా వెంకన్న పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను కలిసిన అనంతరం విలేకరులతో బుద్దా వెంకన్న మాట్లాడుతూ, అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు అవినీతికి కేరాఫ్ అడ్ర్‌సగా మారారన్నారు. బుధవారం మచిలీపట్నంలో జరిగే చంద్రబాబు నాయుడు పర్యటనకు వేలాదిగా తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రం ఉందని, మనల్ని చూసి ఇతర రాష్ట్రాల వారు జాలి పడుతున్నారన్నారు.
గుడివాడలో చురుగ్గా ఏర్పాట్లు ..
గుడివాడ : గుడివాడ పట్టణంలో ఈ నెల 13న జరిగే రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను నాయకులు పర్యవేక్షించారు. వాహనాల రాకపోకలకు వీలుగా తాత్కాలిక ర్యాంపులను ఏర్పాటు చేశారు. పార్కింగ్‌కు సభా స్ధలం పక్కనే 14ఎకరాలను చదును చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాములు పనులను పర్యవేక్షించారు. నియోజకవర్గ పరిశీలకులు నల్లగట్ల స్వామిదాసు చంద్రబాబు బస ప్రాంతాన్ని పరిశీలించారు. 14వ తేదీన వీకేఆర్ కన్వెన్షన్‌లో పాస్టర్‌ల సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.