పైసా మే... పార్కింగ్
ABN , First Publish Date - 2023-01-13T00:48:49+05:30 IST
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పార్కింగ్‌లో గోల్‌మాల్ నడుస్తోంది. కేఆర్ మార్కెట్ పార్కింగ్‌లో రోజువారీ వసూలైన దాని కంటే తక్కువ మొత్తంలో జమ అవుతోంది. ఓ అధికారి వెనుక ఉండి ఈ తతంగమంతా నడిపిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోజుకు రూ.25వేల పైచిలుకు వసూలు
వీఎంసీకి చేరేది రూ.15 వేలే..
ఓ అధికారి కనుసన్నల్లో యథేచ్ఛగా దోపిడీ
పాత బకాయిలవైపు కన్నెత్తి చూడని అధికారులు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్) : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పార్కింగ్ స్థలాలు లీజుదారులకు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతంలో స్మార్ట్ పార్కింగ్ పేరుతో ఓ లీజుదారు సుమారు రూ.3 కోట్ల మేర వీఎంసీకి ఎగవేసి వెళ్లగా, ఏడాది క్రితం కేఆర్ మార్కెట్ పార్కింగ్‌ను లీజుకు తీసుకున్న వ్యక్తి అరకోటి మేర నామం పెట్టాడు. దీంతో వీఎంసీ సొంతంగా పార్కింగ్ నిర్వహణ చేపట్టింది. ఏడాది నుంచి వీఎంసీ సిబ్బందే పార్కింగ్ నిర్వహణ చూస్తున్నారు. గతంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు ఆదాయం బాగా తగ్గిందని, దీనికి ప్రధాన కారణం పార్కింగ్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టేట్ విభాగంలో ద్వితీయ స్థాయి అధికారి ఒకరు వసూల్‌రాజా అవతారమెత్తారు. ఆయన కనుసన్నల్లోనే మొత్తం గోల్‌మాల్ వ్యవహారం నడుస్తోందని సమాచారం.
బకాయిల సంగతేంటి..?
కాళేశ్వరరావు మార్కెట్ (కేఆర్) పార్కింగ్ నెలవారీ పార్కింగ్ ఫీజు వసూలులో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతోంది. ఈ పార్కింగ్ ప్రాంతాల్లో రోజూ వందలాది వాహనాలు నిలుపుతారు. గతంలో కార్పొరేషన్ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించగా, ఒక సంస్థ ఏడాదికి రూ.93 లక్షలకు పాడుకుంది. రోజుకు రూ.25,800 చొప్పున కార్పొరే షన్‌కు లభించేది. సుమారు 5 నెలలే నిర్వహించి ఆ సంస్థ వీఎంసీకి పైసా కట్టకుండా, సుమారు అరకోటి బకాయిపడి వెళ్లిపోయింది. ఆ బకాయిల వసూలుపై ఎస్టేట్ అధికారులు దృష్టిపెట్టలేదు.
వచ్చేదెంత.. కట్టేదెంత..?
పాత లీజుదారు వెళ్లిపోయినప్పటి నుంచి కార్పొరేషన్ అధికారులే పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఈ పార్కింగ్ ప్రాంతం నుంచి కార్పొరేషన్‌కు రోజుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లిస్తున్నారు. కేఆర్ సెల్లార్, గద్దబొమ్మ సెంటర్, వస్త్రలత క్యాంటీన్ వద్ద ఎస్‌బీఐ ముందు, వెనుక, గాంధీజీ మునిసిపల్ హైస్కూల్ ప్రాంతాల్లో వీఎంసీకి పార్కింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటితో పాటు కేఆర్ మార్కెట్ పార్కింగ్‌లోనూ కారుకు 3 గంటలకు రూ.30, ఆ తరువాత గంటకు పది రూపాయలు చొప్పున నిర్ణయించారు. మోటార్ సైకిల్‌కు మూడు గంటలకు రూ.10, ఆ తరువాత గంటకు రూ.10 వసూలు చేస్తున్నారు. వన్‌టౌన్‌లోని పేపర్ ముఠా కూలీలు తమ వాహనాలను సెల్లార్‌లో పార్కింగ్ చేసినందుకు అందరూ కలిసి ప్రతినెలా రూ.50 వేలు చెల్లిస్తున్నారు. ఈ ముఠాతో పాటు శివాలయం వీధిలోని ముఠాలు, ఎన్‌ఎస్‌ఆర్, ఎస్‌ఆర్, బసిరెడ్డి, దేవిరెడ్డి ముఠాలు ప్రతినెలా రూ.5 వేల నుంచి రూ.7 వేలు చెల్లిస్తున్నారు. వన్‌టౌన్‌లో పలు దుకాణాల్లో పనిచేసే సిబ్బంది తమ వాహనాలను పార్కింగ్‌లో పెట్టి ఒక్కో వాహనానికి నెలకు రూ.700 చెల్లిస్తున్నారు. ఎంత లేదన్నా కేఆర్ మార్కెట్ పార్కింగ్ ప్రాంతం నుంచి రోజుకు రూ.25 వేలు తక్కువ కాకుండా వసూలవుతోంది. గతంలో లీజుదారులు ఆ అంచనాలతోనే టెండర్లు వేయడం జరిగేది. ప్రస్తుతం వీఎంసీ అధికారులే సొంతంగా పార్కింగ్‌ను నిర్వహిస్తున్నా ఆ స్థాయిలో సొమ్ము కార్పొరేషన్ ఖజానాకు జమ కావడం లేదు. ప్రధానంగా రోజూ తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 9 గంటల వరకు గద్దబొమ్మ సెంటర్ వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున పార్కింగ్ చేస్తుంటారు. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది వాహనదారులకు టోకెన్ ఇవ్వకుండా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్టేట్ విభాగంలోని ఓ అధికారి తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని పార్కింగ్ పాయింట్ల వద్ద నియమించుకుంటూ మిగతా వారిని వేధింపులకు గురిచేస్తూ వేరే విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అధికారి అవినీతిపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిబ్బంది సిద్ధమవుతున్నారు.