‘ప్రకాశ’వంతం
ABN , First Publish Date - 2023-10-07T00:44:55+05:30 IST
ఇటు కృష్ణాజిల్లాలో తూర్పు డెల్టాకు, అటు గుంటూరు జిల్లాలో పశ్చిమ డెల్టాకు సాగునీరును అందిస్తూ కొన్ని దశాబ్దాలుగా రైతులకు సేవలందిస్తున్న మన ప్రకాశం బ్యారేజీ ప్రపంచంలోనే అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అవార్డును దక్కించుకుంది. ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రూపంలో పంపాయి.
వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్‌గా గుర్తింపు
జలవనరుల శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ
దేశంలో ఎంపికైన నాలుగు నిర్మాణాల్లో బ్యారేజీ ఒకటి
నవంబరులో అవార్డు ప్రదానోత్సవం
విజయవాడ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ రంగంలో సమర్థవంతంగా నీటిని వినియోగించే వారసత్వ కట్టడాలను గుర్తించడానికి, వాటిపై చేసే పరిశోధనలను ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజీ సంస్థ ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణాల అవార్డులకు వెళ్లిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. వాటిలో దేశం నుంచి నాలుగు నిర్మాణాలకు ఈ అవార్డు దక్కింది. వాటిలో ప్రకాశం బ్యారేజీకి చోటు దక్కడం విశేషం. విశాఖపట్నంలో నవంబరు రెండు నుంచి ఎనిమిది వరకు నిర్వహించే 25వ ఐసీఐడీ సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
ఇదీ చరిత్ర
1852లో కృష్ణానదిపై సర్ ఆర్థర్ కాటన్ రూ.2 కోట్లతో బ్యారేజీని నిర్మించారు. దీని నిర్మాణం 1855వ సంవత్సరం వరకూ సాగింది. బ్యారేజీకి కాటన్ డిజైన్‌ను రూపొందించగా, కెప్టెన్ ఓర్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 5.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్మించారు. బ్యారేజీ గరిష్ట నీటి సామర్థ్యం 12 అడుగులు. అనంతరం 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే వరకు పెరిగింది. ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటు గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రైతులకు ప్రకాశం బ్యారేజీ కల్పవృక్షమే. దీనికి మొత్తం 70 గేట్లను అమర్చారు. 1954 నుంచి 1957 వరకు రూ.2.78 కోట్లతో ఆధునికీకరించారు. అప్పటి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు హయాంలో ఈ పనులు జరగడంతో బ్యారేజీకి ఆయన పేరే పెట్టారు. ఇన్నేళ్ల బ్యారేజీ చరిత్రలో 2009లో అత్యధిక స్థాయిలో వరద వచ్చింది. 2009 అక్టోబరు 2 నుంచి 13వ తేదీ వరకు మొత్తం 11లక్షల10వేల404 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అంతటి ప్రమాదకర పరిస్థితిని తట్టుకుని ఈ రాతి కట్టడం నిలబడింది. 1998లో బ్యారేజీకి 9లక్షల32వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ రికార్డును 2009 వరదలు పక్కకు నెట్టాయి.