పునాదులు దాటని జగనన్న ఇళ్లు!
ABN , First Publish Date - 2023-03-06T00:22:56+05:30 IST
జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. నానాటికి పెరుగుతున్న వ్యయభారం, అధికారుల ఒత్తిడితో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఫ వ్యయ భారంతో బాపులపాడు మండలంలో నిలిచిపోతున్న నిర్మాణాలు
ఫ తొలి విడతగా 3,083 మంజూరు
ఫ1304 గృహా నిర్మాణాలు ప్రారంభం .. 240 ఇళ్లు పూర్తి
ఫ అధికారుల ఒత్తిడి.. ఆందోళనలో లబ్ధిదారులు
హనుమాన్‌జంక్షన్, మార్చి 5 : జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. నానాటికి పెరుగుతున్న వ్యయభారం, అధికారుల ఒత్తిడితో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పనులు మొదలు పెట్టి దాదాపుగా రెండేళ్లు అవుతు న్నా గృహ నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం రూ.1.50లక్షలు పునాదులకే సరిపోతున్నాయి. బాపులపాడు మండలంలో 3083 గృహాలను మొదటి విడతగా మంజూరు చేయగా, అందులో 1304 గృహాలు మాత్రమే ప్రారంభించారు. ప్రారంభించిన వాటిలో ఇప్పటి వరకు 240 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. అనుకున్న స్థాయిలో గృహ నిర్మాణాలు పూర్తికాకపోవడంతో అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. మండలంలో అతి పెద్ద లేఅవుట్‌గా ఏర్పాటు చేసిన బాపులపాడు జగనన్న కాలనీ లేఅవుట్‌లో 595 గృహాలు మంజూరు చేయగా అందులో 193 మాత్రమే ప్రారంభించారు. 55 గృహాలు పూర్తి అయ్యాయి. మిగిలిన140 గృహాలు బేస్‌మెంట్ లెవల్‌లోనే ఉన్నాయి. బాపులపాడులో కొత్తగా మరో 631 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ లేవుట్‌లో ప్లాట్లు కేటాయింపు జరగలేదు. మండలంలో మరో పెద్ద లేఅవుట్ వీరవల్లిలో కూడా 327 గృహాలు మంజూరు కాగా అందులో 201 గృహాలు మాత్రమే నిర్మాణం చేపట్టారు. అందులో 43 అతికష్టం మీద పూర్తి చేశారు. మండలం మొత్తం మీద చూస్తే 1304 గృహాలు బేస్‌మెంట్ స్థాయిల్లో ఉండగా 240 గృహాలు పూర్తి చేశారు. ఇసుక, సిమెంట్, ఇనుము, ఇతర ఖర్చులు ముఖ్యంగా తాపీ కూలీలు ఖర్చు భరించలేనంతగా పెరగడంతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు.