బెజవాడకు శాటిలైట్‌ రైల్వేస్టేషన్లు

ABN , First Publish Date - 2023-05-23T00:11:49+05:30 IST

దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడలోని ఏ1 రైల్వేస్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించటానికి బెజవాడ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెజవాడకు నాలుగు వైపులా చతుర్మఖంగా శాటిలైట్‌ స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

బెజవాడకు శాటిలైట్‌ రైల్వేస్టేషన్లు

దేశంలోనే రెండో అతిపెద్ద జంక్షన్‌పై ఒత్తిడిని తగ్గించటానికి రైల్వే బృహత్తర ప్రణాళికలు

ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసిన విజయవాడ రైల్వే డివిజన్‌

రాయనపాడుతో పాటు గుణదల, రామవరప్పాడు, కృష్ణాకెనాల్‌ జంక్షన్‌లలో..

మధురానగర్‌ను పరిశీలించినా... స్థలం లేకపోవటంతో తాత్కాలికంగా వెనక్కు

పరిశీలనలో సింగ్‌నగర్‌ కొత్త స్టేషన్‌ అంశం

దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడలోని ఏ1 రైల్వేస్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించటానికి బెజవాడ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెజవాడకు నాలుగు వైపులా చతుర్మఖంగా శాటిలైట్‌ స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాయనపాడులో ఇప్పటికే ఒక శాటిలైట్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. దీని తరహాలో గుణదల, రామవరప్పాడు, కృష్ణాకెనాల్‌ జంక్షన్లలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బెజవాడ డివిజన్‌ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అతి త్వరలో గుణదల, రామవరప్పాడు, కృష్ణాకెనాల్‌ జంక్షన్లలో ఆధునిక రైల్వేస్టేషన్లను నిర్మించి విస్తరిస్తారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ దేశంలోని స్వర్ణ చతుర్భజ మార్గాలకు అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి దేశ వ్యాప్తంగా అనేక రైళ్లు విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ మీదుగా పాసింగ్‌ అవుతుంటాయి. ఇక్కడి నుంచి రైళ్లు బయలుదేరుతున్నా.. సింహభాగం పాసింగ్‌ త్రూ రైళ్లు ఉండటం వల్ల విపరీతమైన రద్దీ నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దశాబ్ద కాలంగా రైల్వే అధికారులు మచిలీపట్నం, నర్సాపూర్‌లతో పాటు కొన్ని రైళ్లను గుంటూరు నుంచి కూడా ఆపరేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ రైల్వేస్టేషన్‌పై నెలకొన్న రద్దీ చాలా తీవ్రంగా ఉంటోంది. విజయవాడ స్టేషన్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించటం కోసం అదనంగా మరికొన్ని శాటిలైట్‌ రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో గుణదల రైల్వేస్టేషన్‌ను శాటిలైట్‌ స్టేషన్‌గా చేయాలని కొద్ది కాలంగా రైల్వేలో చర్చ నడుస్తోంది. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కార్యరూపంలోకి రాబోతోంది.

గుణదల రైల్వేస్టేషన్‌ పూర్తి ఆధునీకరణ

గుణదల రైల్వేస్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరిస్తారు. కొత్తగా ఆధునిక వసతులతో రైల్వేస్టేషన్‌ను నిర్మిస్తారు. ప్లాట్‌ఫామ్‌లను పెంచుతారు. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు, ప్రయాణికుల కోసం రిజర్వేషన్‌ కౌంటర్లు, ఇతర అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. గుణదల రైల్వేస్టేషన్‌కు సరైన రోడ్డు లేదు. ఈ అంశంపై కూడా రైల్వే అధికారులు దృష్టి సారించనున్నారు. కార్పొరేషన్‌, ఆర్‌అండ్‌బీల భాగస్వామ్యంతో గుణదల రైల్వేస్టేషన్‌ రోడ్డును దక్షిణ దిక్కున ఏలూరు రోడ్డుకు, ఉత్తర దిక్కున ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానించనున్నారు. ఇప్పటి వరకు పరిశీలనలోని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌ను కూడా శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రామవరప్పాడు స్టేషన్‌ విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉంటుంది. ఎన్‌హెచ్‌ - 16కు చేరువన ఉంటుంది. ఇక్కడ శాటిలైట్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేసి పలు రైళ్లకు హాల్టింగ్‌ ఇస్తే ఇక్కడి దిగే ప్రయాణికులు నగరంలోకి తేలిగ్గా ప్రవేశించవచ్చు. రామవరప్పాడు రైల్వేస్టేషన్‌ను విజయవాడ - గుడివాడ - మచిలీపట్నం, గుడివాడ - భీమవరం, నరసాపూర్‌ - భీమవరం - నిడదవోలు డబ్లింగ్‌ విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఆధునికీకరించారు. కాబట్టి ఇక్కడ శాటిలైట్‌ స్టేషన్‌కు అవసరమైన హంగులను కల్పిస్తారు. రామవరప్పాడు స్టేషన్‌ను శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలన్నది ఊహించనిది అయినా రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా మంచిదనే చెప్పాల్సి ఉంటుంది.

కృష్ణా కెనాల్‌ జంక్షన్‌కు కొత్త సొబగులు

వీటన్నింటికంటే కీలకమైనది కృష్ణాకెనాల్‌ జంక్షన్‌. ఇక్కడ అపారమైన భూ వనరులు ఉన్నాయి. విజయవాడ వంటి స్టేషన్‌ను కృష్ణా కెనాల్‌ జంక్షన్‌లో అభివృద్ధి చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు వస్తున్నాయి. విజయవాడ మీద ఒత్తిడి తగ్గించటానికి, అమరావతి రాజధానికి నూతన మార్గం అనుసంధానతకు కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌ ఉన్నా ఇప్పటి వరకు ఆ దిశగా కార్యరూపం దాల్చలేదు. ఈ రూపంలో అయినా కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ కొత్త సొబగులను సంతరించుకోనుంది. విజయవాడ మీదుగా దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లు విజయవాడలో కాకుండా కృష్ణా కెనాల్‌ జంక్షన్‌లో రైళ్లు ఆగుతాయి. దీంతో అక్కడి నుంచి విజయవాడ, అమరావతిలకు త్వరగా చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. విజయవాడలోనే మెయిన్‌ లైన్‌పై మధురానగర్‌ రైల్వేస్టేషన్‌ ఉంది. ఇది మెయిన్‌లైన్‌పై ఉండటం వల్ల ఇక్కడ శాటిలైట్‌ స్టేషన్‌ అభివృద్ధి చేయటం చాలా ముఖ్యమని రైల్వే అధికారులు గుర్తించారు. ఇక్కడ స్థలాభావ సమస్య ఏర్పడటంతో.. శాటిలైట్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయలేమని భావిస్తున్నారు. భవిష్యత్తులో మధురానగర్‌లో కూడా శాటిలైట్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయవచ్చు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సూచించిన సింగ్‌నగర్‌లో నూతన రైల్వేస్టేషన్‌ ఏర్పాటు అంశం కూడా రైల్వే అధికారుల పరిశీలనలో ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

Updated Date - 2023-05-23T00:11:49+05:30 IST