సానుకూలంగా స్పందించండి..
ABN , First Publish Date - 2023-05-09T00:39:46+05:30 IST
అర్జీదారుల నుంచి స్వీకరించిన అర్జీలపై సంబంధిత అధికారులు సానుకూల దృక్పధంతో స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్‌వో కె.మోహన్‌కుమార్‌లు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
కలెక్టరేట్, మే 8 : అర్జీదారుల నుంచి స్వీకరించిన అర్జీలపై సంబంధిత అధికారులు సానుకూల దృక్పధంతో స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్‌వో కె.మోహన్‌కుమార్‌లు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అర్జీలకు శాశ్వత పరిష్కార మార్గం చూపించినప్పుడే పూర్తి సంతృప్తి చెందే అవకాశం ఉంటుందని అప్పుడే స్పందన లక్ష్యం నెరవేతుందన్నారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన్నప్పుడే పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. పారదర్శకంగా సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో జిల్లా అధికారులు భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస్, డీఎ్‌సవో పి.కోమలి పద్మ, డ్వామ పీడీ జె.సునీత, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, హౌసింగ్ పీడీ రజినీ కుమారి, పశుసంవర్ధక శాఖ జేడీ కె.విద్యాసాగర్, జిల్లా సర్వే అధికారి కె.సూర్యారావు, డీసీవో సీహెచ్ శైలజ, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ ఇతర అధికారులు పాల్గొన్నారు.
స్పందనలో అధికంగా 120 అర్జీల నమోదు
స్పందన కార్యక్రమంలో అధికంగా 120 అర్జీల నమోదైనట్టు కలెక్టర్ దిల్లీరావు తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ 37, పోలీస్ 21, ఎంఏయుడి 12, పంచాయితీరాజ్ 6, ఉపాధి కల్పన 4, సహాకార శాఖ 4, గృహ నిర్మాణం 3, ఏపిఆర్‌టిసి 3, బ్యాంకులకు సంబంధించిన 3 అర్జీలు, హౌసింగ్ 3, సాంఘీక సంక్షేమం 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 2, గనులు 2, సిల్క్ డెవల్‌పమెంట్ 2, విద్యుత్ శాఖ 2, జలవనరులు 2, డ్వామా 2, హెల్త్ 1, మైనార్టీ 1, ఆర్‌అండ్‌బి 1, ఆర్‌డబ్ల్యుఎస్ 1, బిసి వెల్ఫేర్ 1, సర్వే 1, అటవీ శాఖ 1, విద్య శాఖ 1, మత్స్య శాఖ 1, రిజిస్ట్రర్ అండ్ స్టాంప్స్ 1, పౌర సరఫరాలు 1 అర్జీలు నమోదు అయ్యాయని కలెక్టర్ తెలిపారు.
విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు గ్రామంలో ఉపాధి పనులు కల్పించలేదని కూలీలు ఆందోళన చెందుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని, రాజస్థాన్‌లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స దుర్గాభవానీ, నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, నగర అధ్యక్షులు ఓర్సు భారతిలు డిమాండ్ చేశారు.
అక్రమ మైనింగ్ అరికట్టండి : కొత్తూరు తాడేపల్లి వాసుల ఫిర్యాదు
విజయవాడ రూరల్ : కొత్తూరు తాడేపల్లిలో అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని గ్రామస్థులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావుకు స్పందనలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ఈ మేరకు అర్జీని అందజేశారు. ఇటీవల గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ గ్రామంలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించారని గుర్తుచేశారు. ఎక్కడైతే విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పారో నేడు అదే ప్రాంతంలో తిరిగి మైనింగ్ జరుగుతున్నదని తెలిపారు. ఆదివారం మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. గ్రామంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని కోరారు.