రైతు భరోసా కేంద్ర ముట్టడి

ABN , First Publish Date - 2023-03-15T01:47:56+05:30 IST

ధాన్యం నగదు చెల్లించాలంటూ చిట్టూర్పు రైతు భరోసా కేంద్రాన్ని గ్రామ రైతులు మంగళవారం ముట్టడించి ఆందోళన చేశారు.

 రైతు భరోసా కేంద్ర ముట్టడి

ఘంటసాల, మార్చి 14 : ధాన్యం నగదు చెల్లించాలంటూ చిట్టూర్పు రైతు భరోసా కేంద్రాన్ని గ్రామ రైతులు మంగళవారం ముట్టడించి ఆందోళన చేశారు. జనవరి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మి గిలి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మీనమేషాలు లెక్కించటం తగదన్నారు. వర్షాలు పడి నష్టం జరిగితే మీరు పరిహారం చెల్లిస్తారా? మొవ్వ ఏడిఏ శ్యామల, ఏవో కె.మురళీకృష్ణలను నిలదీశారు. ఏడీఏ మాట్లాడుతూ రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరి స్తామని తెలిపారు. గుత్తికొండ వరప్రసాద్‌, మల్లుపెద్ది సాంబశివరావు, మల్లుపెద్ది జగదీష్‌, మల్లుపెద్ది ప్రవీణ్‌, పరుచూరి సాయి మోహన్‌, పరుచూరి ప్రసాద్‌, దాసరి సతీష్‌, యలవర్తి వంశీకృష్ణ, దాసరి ధీరజ్‌, దాసరి శివ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

చల్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా

చల్లపల్లి : రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో చల్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. గాంధీజీ స్మృతివనం నుంచి పాదయాత్రగా వచ్చి ధర్నా చేపట్టారు. ఆఫ్‌లైన్‌లో తోలిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తహసీల్ధార్‌ కె.గోపాలకృష్ణకు వినతిపత్రం అందించి రైతుల సమస్యలు ఏకరువు పెట్టారు. తహసీల్దార్‌ వెంటనే స్పందించి సివిల్‌ సప్లయిస్‌ ఎండీతో ఫోన్‌లో మాట్లాడి రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నాలుగు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమానుల సురేంద్రనాధ్‌ బెనర్జీ, నియజకవర్గ కార్యదర్శి అట్లూరి వెంకటేశ్వరరావు, నేతలు గుత్తికొండ రామారావు, మల్లుపెద్ది సాయిరత్నబాబు, గుత్తికొండ ప్రసాద్‌, పరిశె మౌళి తదితరులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు వేగవంతం చేయాలి : మండలి

అవనిగడ్డ టౌన్‌ : ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. వాతావరణ హెచ్చరికలతో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. వానలు పడి రైతులు నష్టపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మిగిలి ఉన్న 30 శాతం ధాన్యం వెంటనే కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : వర్ల

పామర్రు: రైతుల ఇబ్బందులు పరిష్కరించడంలో జగన్‌ స ర్కార్‌ పూర్తిగా విఫలమైందని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా విమర్శించారు. పామర్రులో మం గళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తోలిన ధాన్యానికి నగదు జమ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నాయీ బ్రాహ్మణ కాలనీలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-03-15T01:47:56+05:30 IST