ఆలస్యంగా అడుగులు..

ABN , First Publish Date - 2023-06-13T00:23:43+05:30 IST

భూసార పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నత్తకే నడకలు నేర్పుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడచిన తరువాత జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీచేసింది. జూన్‌లో ఆయా మండలాల వారీగా నాలుగువేల మట్టి నమూనాలు సేకరించి బాపట్లలోని వ్యవసాయ యూనివర్సిటీకి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ శాంపిళ్లను ఇప్పుడు సేకరించి బాపట్లకు ఎప్పుడు పంపుతారు? ఎప్పటికి ఈ వివరాలు రైతులు దరికి చేరుతాయి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మూడేళ్లక్రితం భూసార పరీక్షలను నిలిపివేసిన ప్రభుత్వం తీరిగ్గా ఈ ఏడాది జూన్‌లో భూసార పరీక్షలకు మట్టి నమూనాలు సేకరించాలని చెప్పడం గమనించదగ్గ అంశం.

ఆలస్యంగా అడుగులు..

భూసార పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన తరువాత కళ్లు తెరిచారు..

ఖరీఫ్‌, రబీ సీజన్లలో 26,140 శాంపిళ్లు సేకరించాలని లక్ష్యం

జూన్‌లో 4వేల మట్టి నమూనాలు పంపాలని వ్యవసాయశాఖకు ఆదేశాలు

భూసార పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నత్తకే నడకలు నేర్పుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడచిన తరువాత జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీచేసింది. జూన్‌లో ఆయా మండలాల వారీగా నాలుగువేల మట్టి నమూనాలు సేకరించి బాపట్లలోని వ్యవసాయ యూనివర్సిటీకి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ శాంపిళ్లను ఇప్పుడు సేకరించి బాపట్లకు ఎప్పుడు పంపుతారు? ఎప్పటికి ఈ వివరాలు రైతులు దరికి చేరుతాయి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మూడేళ్లక్రితం భూసార పరీక్షలను నిలిపివేసిన ప్రభుత్వం తీరిగ్గా ఈ ఏడాది జూన్‌లో భూసార పరీక్షలకు మట్టి నమూనాలు సేకరించాలని చెప్పడం గమనించదగ్గ అంశం.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌కు సాగునీరు అందించలేదు. దీంతో రైతులు మినుము పంటను సాగు చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు భూములు ఖాళీగానే ఉన్నాయి. మినుము పంటను సాగు చేసినా భూసార పరీక్షలకు మట్టి నమూనాలను సేకరించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే అధికారులు మట్టి నమూనాలను సేకరించకుండా మిన్నకుండిపోయారు. మట్టి నమూనాలను సేకరించి, భూసార పరీక్షలు నిర్వహించి, భూమిలో ఎలాంటి లోపాలున్నాయి? భూమిలో నత్రజని, భాస్వరం తదితరాలు ఎంతశాతం మేర ఉన్నాయి? ఏ రకం ఎరువుల వాడకం పెంచాలి? ఏ రకం ఎరువుల వాడకం తగ్గించాలి? పంటమార్పిడి, ఏయే పంటలు సాగు చేయడానికి భూమి అనుకూలంగా ఉంది? తదితర వివరాలను తెలియజేస్తారు. భూసార పరీక్షల వివరాలను నేరుగా రైతుల సెల్‌ఫోన్లకు సమాచారం పంపుతారు. వాటి ఆధారంగా రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతిక నిపుణుల సలహా మేరకు ఎరువుల వాడకాన్ని పెంచడమో, తగ్గించడమో చేయాలి. భూసార పరీక్షలు ఈపాటికే చేసి ఉంటే రైతులకు ఉపయోగం ఉండేది. జూన్‌లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు మట్టి నమూనాలు సేకరిస్తే ఈ వివరాలు రైతులకు తెలియజేయడానికి కనీసంగా రెండు నెలలకుపైగా సమయం పడుతుంది. ఈలోగా రైతులు నారుమడులు పోసి, నాట్లు వేయడం కూడా పూర్తి చేస్తారు. నాట్లు పూర్తిచేసిన నెలలోపే రెండు విడతలుగా సూక్ష్మపోషక ఎరువులను పొలంలో చల్లుతారు. ముందస్తుగానే భూసార పరీక్షలు నిర్వహించి ఆ వివరాలను రైతులకు తెలియజేస్తే ఎరువులను ఇబ్బడిముబ్బడిగా వాడకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉండేది. జూన్‌ నెలలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలోని 25 మండలాల నుంచి 4వేల మట్టి నమూనాలను సేకరించాలని ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీచేసింది. ఈ ఏడాది ఖరీప్‌, రబీ సీజన్లలో మొత్తంగా 26.140 మట్టి నమూనాలు సేకరించి బాపట్ల వ్యవసాయ యూనివర్సిటీకి పంపాలని సూచించింది.

పొలంబడి బిల్లులు మూడేళ్ల్లుగా పెండింగ్‌లోనే

జిల్లాలోని 25 మండలాల్లో ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో విత్తనాలు నాటిన నాటి నుంచి పంటకోత కోసే వరకు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతినెలా పొలంబడిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పొలం వద్దకు వెళ్లి పైరును, పంటలను పరిశీలించి పైరుకు సోకిన తెగుళ్లను గుర్తించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించాలి. ఒక్కో పొలంబడిలో కనీసంగా 30 మంది రైతులను భాగస్వాములుగా చేసి వారికి వివిధ పంటలలో యాజమాన్య పద్ధతులను వివరించాలి. పొలంబడి నిర్వహణ కోసం మండలానికి ఏడాదికి రూ.21 వేలను ప్రభుత్వం విడుదల చేయాలి. గత మూడు సంవత్సరాలుగా పొలంబడి నిర్వహణ బిల్లులను ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. మండల వ్యవసాయశాఖ అధికారులు బిల్లులు చేసి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయానికి పంపితే ప్రభుత్వానికి ఈ బిల్లులను సమర్పించామని, సీఎఫ్‌ఎంఎస్‌లో ద్వారా ట్రెజరీలో పెండింగ్‌లో ఉండిపోయాయని, త్వరలోనే మంజూరవుతాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మూడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. మండల వ్యవసాయశాఖ అధికారులు ఈ ఖర్చుల భారం తమకెందుకని గ్రామాల్లో ఉన్న వ్యవసాయశాఖ అసిస్టెంట్లకు ఈ పనిని అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు.

సూక్ష్మపోషక ఎరువుల నిలిపివేత

పొలంలో సూక్ష్మపోషకాల లోటు రాకుండా ఉండేందుకు టీడీపీ ప్రభుత్వంలో జింక్‌, బోరాన్‌, జిప్పం వంటి సూక్ష్మపోషక ఎరువులను నూరుశాతం సబ్సిడీతో అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ తరహా ఎరువులను రైతులకు సబ్సిడీపై ఇవ్వడంలేదు. పంటలు సాగు చేయకముందు, సాగుచేసిన తరువాత సూక్ష్మపోషకాలను వాడితే పైరు ఎదుగుదల కోసం చల్లిన ఎరువులు పూర్తిస్థాయిలో పైరు వినియోగించుకుంటుందని రైతులు చెబుతున్నారు. దీంతో వివిధ పంటల దిగుబడులు పెరుగుతాయని రైతులు అంటున్నారు. సూక్ష్మపోషక ఎరువులను ఇవ్వాలని రైతులు వ్యవసాయశాఖ అధికారులను కోరితే సబ్సిడీపై ఇవ్వడం ప్రభుత్వం నిలిపివేసిందని, బహిరంగ మార్కెట్‌లోనే కొనుగోలు చేసుకోవాలి చెప్పి రైతులను పంపేస్తున్నారు.

Updated Date - 2023-06-13T00:23:43+05:30 IST