కృష్ణానదిలో దూకేందుకు యువకుడి యత్నం..రక్షించిన పోలీసులు

ABN , First Publish Date - 2023-05-25T00:59:02+05:30 IST

బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య చదవాలన్నది ఆ యువకుడి కోరిక. డిగ్రీ పూర్తి చేశాడు కాబట్టి ఏదో ఒక కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందన్నది తల్లిదండ్రుల ఆలోచన.

కృష్ణానదిలో దూకేందుకు యువకుడి యత్నం..రక్షించిన పోలీసులు
ఎంఏఎల్‌ ప్రసాద్‌ను తండ్రికి అప్పగిస్తున్న పోలీసులు

విజయవాడ, మే 24(ఆంధ్రజ్యోతి): బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య చదవాలన్నది ఆ యువకుడి కోరిక. డిగ్రీ పూర్తి చేశాడు కాబట్టి ఏదో ఒక కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందన్నది తల్లిదండ్రుల ఆలోచన. తల్లిదండ్రుల ఆలోచన మేరకు కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. అది ఇష్టం లేకపోవడంతో చనిపోవాలనుకున్నాడు ఆ యువకుడిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పార్వతీపురం జిల్లా సాలూరుకు చెందిన ఎంఏఎల్‌ ప్రసాద్‌ మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత ఎమ్మెస్సీ చేయాలనుకున్నాడు. తండ్రి వెంకటరమణ మాత్రం డిగ్రీ వరకు చాలని వారించాడు. కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటే ఏదో ఒక ఉపాధి లభిస్తుందని కుమారుడికి నచ్చజెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు ప్రసాద్‌ చెవులకు ఎక్కలేదు. ఉన్నత విద్యపైనే అతడు ఆశలు పెట్టుకున్నాడు. కుమారుడి అభిప్రాయంతో సంబంధం లేకుండా తండ్రి అతడిని విజయవాడ గాంధీనగరంలోని ఓ కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించాడు. సాలూరు నుంచి మంగళవారం విజయవాడకు వచ్చిన ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లకుండా బస్టాండ్‌లో కొంతసేపు గడిపాడు. తర్వాత కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. రైల్వేట్రాక్‌ మీద నుంచి నడుచుకుంటూ బ్రిడ్జిపైకి వెళ్లి, దూకడానికి ప్రయత్నిస్తుండగా అక్క డున్న జాలర్లు డయల్‌ 100కి ఫోన్‌ చేశారు. కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌ దుర్గారా వుతో పాటు కానిస్టేబుళ్లు వెంటనే అక్కడకు వెళ్లి ప్రసాద్‌ను రక్షించారు. అతడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రసాద్‌ నుంచి తండ్రి వెంకటరమణ ఫోన్‌ నంబర్‌ తీసుకుని ఆయనకు ఫోన్‌ చేశారు. సాలూరు నుంచి తండ్రి వచ్చిన తర్వాత బుధవారం ప్రసాద్‌ను అప్పగించారు.

Updated Date - 2023-05-25T00:59:02+05:30 IST