కడగండ్లు!

ABN , First Publish Date - 2023-03-24T01:06:50+05:30 IST

జిల్లాలో పలుచోట్ల గురువారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. రహదారులు జలమయమయ్యాయి. ఆరుగాలం కష్టించి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కడగండ్లు!

గుడివాడ/హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, మార్చి 23 : జిల్లాలో పలుచోట్ల గురువారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. రహదారులు జలమయమయ్యాయి. ఆరుగాలం కష్టించి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం మధ్యాహ్నం రెండుగంటల పాటు ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కారణంగా గుడివాడ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగి మురుగు నీరు రహదారులపైకి చేరింది.పాదచారులు, ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

బాపులపాడు మండలంలోని రేమల్లె, మల్లవల్లి, కొత్తపల్లి, కాకులపాడు, అప్పారావుపేట తదితర గ్రామాల్లో ఈదురుగాలులు, వడగళ్లతోకురిసిన భారీ వర్షం రైతులకు అపార నష్టం చేకూర్చింది. రంగయ్యప్పారావుపేట, ఆరుగొలను గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న, మెండెంలపై ఆరబెట్టిన పొగాకు తడిసి పనికిరాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మల్లవల్లి, రేమల్లె తదితర గ్రామాల్లో 232 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న పొగాకు పంటకుళ్లిపోవడం, కోసి మెండెంపై ఆరబెట్టిన పొగాకుగాలులకు పడిపోయి వర్షానికి తడిసి ఎందుకు పనికిరాకుండా పోయిందని, మళ్లీ సాగు మొదలెట్టాల్సిందేనంటూ రైతులు శివరావు, నాగరాజు, తదితరులు కన్నీటి పర్యంతమయ్యారు.

మినుము, పెసర రైతులకు ఏమి చేయాలో తెలియని స్ధితిలో ఉన్నారు. ప్రభుత్వం కోసి పనల మీద ఉన్న వాటికి నష్టపరిహారం ఉండదని, పంట కోయకుండా(తీతతీయకుండా) ఉంటేనే నష్టపరిహారం చెల్లించేందుకు ఆర్బీకేలల్లో నమోదు చేసుకోవాలనడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నామని ఆరుగొలను, కాకులపాడు, అప్పారావుపేట తదితర గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 769 ఎకరాల్లో మినుము, పెనర సాగు చేశారు. అకాల వర్షాలకు పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఎం

వర్షాలతో చేతికివచ్చిన పంట మొత్తం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి బేతా శ్రీనివాసరావు, రైతు సంఘ కార్యదర్శి తోట సాంబశివరావు డిమాండ్‌ చేశారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

రైతులను అదుకోవాలి : నెట్టెం

ఎ.కొండూరు : అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం అదుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని గొల్లమందలో వర్షాలకు నేలకొరిగిన మొక్కజోన్న, మిర్చి పంటలను పరిసీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే ప్రభుత్వ యంత్రాంగం నష్టం అంచానలు వేయలేదని అన్నారు. మెట్ట ప్రాంతాలైన జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గంలో పంట చేతికొచ్చే సమయంలో మొక్కజొన్న నెలకొరిగిందని, మిర్చి, మామిడి పంటలకు తీవ్ర నష్ట జరిగిందని, తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు మొక్కజొన్నకు రూ.25 వేలు, మిర్చి రైతుకు రూ. 50 వేలు పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. తిరువూరు సభలో సీఎం జగన్‌రెడ్డి మోసపూరిత హామీలు ఇచ్చారని, నాలుగేళ్లుగా నియోజక వర్గంలో చేయలేని గంపలగూడెం కట్టేలేరు వంతెన, ఎ.కొండూరు మండలానికి కృష్ణాజలాల సరఫరా, డయాలసిస్‌ కేంద్రం, రోడ్లు అభివృద్ధి నీటిమిద రాతలే అన్నారు.

పిడుగుపాటుకు రైతు మృతి

పెడన రూరల్‌ : నడుపూరు గ్రామంలో రైతు పరసా వెంకటేశ్వరరావు(54) గురువారం సాయంత్రం తన పొలంలో గొర్రెలను మేపుతుండగా పిడుగుపాటుకు గురై కుప్పకూలి పోయాడు. బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతు మృతితో నడుపూరు గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.

Updated Date - 2023-03-24T01:06:50+05:30 IST