Ramakrishna: జగన్ నూతన విధానం వల్ల నేతల చేతుల్లోకి పేదల భూములు..
ABN , First Publish Date - 2023-09-01T21:58:49+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శలు గుప్పించారు.
కర్నూలు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శలు గుప్పించారు. జగన్ తెచ్చిన నూతన విధానం వల్ల 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో పేదల భూములు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తాయని రామకృష్ణ అన్నారు.
"రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోంది. జగన్ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీశారు. జగన్ రూ. 9 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపారు. రూ. 50 వేల కోట్లు కరెంట్ బిల్లులు ప్రజలపై వేశారు. రూ. 30 లక్షల మందికి పట్టాలిచ్చానని జగన్ అంటున్నారు. ఎవరికి ఇచ్చారో చెప్పాలి. కర్నూలులో జుడీషియల్ క్యాపిటల్ పెట్టాలనుకుంటుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన అంటున్నారు. ఎవరు అడ్డం పడ్డారో బుగ్గన చెప్పాలి. హైకోర్టు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్ పెట్టారా లేదా చెప్పాలని సవాల్ విసురుతున్నా. జగన్ త్వరలో విశాఖకు వెళ్తారు అంటున్నారు. ఎవరు వద్దంటున్నారు. సింహం సింగిల్ గా వస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు. మరి జగన్ పోలీసులతో పరదాల మాటున ఎందుకు వస్తున్నారో. జగన్ నాలుగేళ్లైనా టిడ్కో ఇళ్లు ఇవ్వలేదు. 20 వేల ఇందిరమ్మ ఇళ్లు కర్నూలు శివారులోని జగన్నాధ గట్టుపై ఉన్నాయి. వాటిని ఇవ్వడం లేదు. మాది పేదల ప్రభుత్వం పెత్తందారులతో పోరాడుతున్నానని జగన్ అంటున్నారు. ఎకరాల్లో జగన్ ఇళ్లు కట్టుకున్నారు. కానీ జగన్ బాత్ రూమ్ అంతగా కూడా పేదలకు ఇళ్లు ఉండకూడదా. వైసీపీ ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు. అసైన్డ్ భూములపై జగన్ తెచ్చిన నూతన విధానం వల్ల పదేళ్ల తర్వాత రాష్ట్రంలో పేదల భూములు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తాయి. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు రానున్నాయి. డబ్బులు తీసుకుని మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉండదు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారు. ప్రధాని మోదీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు." అని సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.