టీడీపీ హయాంలోనే నంద్యాల అభివృద్ధి
ABN , First Publish Date - 2023-07-12T23:45:29+05:30 IST
టీడీపీ హయంలోనే నంద్యాల అభివృద్ధి చెందిందని, గత ప్రభుత్వం చేపట్టిన ఒక్క పనిని కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇనచార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అసమర్థ పాలన
చైతన్య రథయాత్రలో భూమా బ్రహ్మనందరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి
నంద్యాల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): టీడీపీ హయంలోనే నంద్యాల అభివృద్ధి చెందిందని, గత ప్రభుత్వం చేపట్టిన ఒక్క పనిని కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇనచార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథయాత్ర నంద్యాలలో బుధవారం మొదలైంది. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఆ తర్వాత అధికారంలోనికి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. కుందూనదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు, పాలిటెక్నిక్ కళాశాల, అంబేడ్కర్ భవన నిర్మాణ పనులను ఇంతవరకు పూర్తిచేయలేదని, అవి టీడీపీ మొదలుపెట్టిన పనులు కావడం, వాటిని పూర్తి చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న భయంతోనే వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి టీడీపీ 90 శాతం పనులు పూర్తి చేస్తే 10 శాతం పనులు పూర్తి చేయలేక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని, దీంతో ఎంతోమంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణ ప్రజలు మంచినీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంతో ఇప్పటికే ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్ధ పాలన కొనసాగుతోందని, అభివృద్ధి గురించి వైసీపీ పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని అన్నారు. కేవలం తమ ఆస్తులను కాపాడుకోవడం లక్ష్యంగా వైసీపీ నాయకులు ఉన్నారని విమర్శించారు. టీడీపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడంతో యువత తల్లిదండ్రులు మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అంతకుముందు బ్రహ్మానందరెడ్డి తన అనుచరులతో కలిసి స్థానిక ప్రథమనందీశ్వరాలయం వరకు బైక్ ర్యాలీ తీశారు. అక్కడ వినాయక, శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బస్సుకు పూజలు చేసి, మాండ్ర, రామచంద్రరావు, ఇతర నాయకులతో కలిసి రథయాత్రను ప్రారంభించారు. శ్రీనివాససెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.