వైభవంగా వైకుంఠ ఏకాదశి
ABN , First Publish Date - 2023-01-03T01:27:42+05:30 IST
వైష్ణవ భక్తులకు అత్యంత ఆరాధ్యమైన వేడుక వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)ని సోమవారం జిల్లాలోని హైందవ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం దర్శనాలు
కర్నూలు(కల్చరల్), జనవరి 2: వైష్ణవ భక్తులకు అత్యంత ఆరాధ్యమైన వేడుక వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)ని సోమవారం జిల్లాలోని హైందవ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఏడాదిలో ఈ ఒక్క రోజునే ఆలయాల్లో ఉత్తర దిశగా ద్వారం తెరిచి, ఈ ద్వారం ద్వారానే భక్తులకు స్వామివారిని దర్శించే అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో సోమ వారం వేకువ జామునుంచే ఆయా ప్రాంతాల్లో ఆలయాల వద్ద భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుంచే నారీకేళాలు, ఫల పుష్పాలు, పూజా ద్రవ్యాలతో ఆలయాలకు చేరుకొని ఉత్తర ద్వారం వద్ద భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాలను శోభాయమానంగా అలరించారు. ఉత్తర ద్వారాలను విభిన్న రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకోని ఆలయాల వద్ద ఉత్తర ద్వారం దర్శనాలకోసం ప్రత్యేకంగా బారీకేడ్లు ఏర్పాటు చేసి, క్యూ లైన్లద్వారా భక్తులకు ఆలయంలో పూజలకు అవకాశాలు కల్పించారు.
కర్నూలు నగరంలో...
నగరంలోని సంకల్‌బాగ్‌లోగల హరిహర క్షేత్రమైన భూదేవీ, శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు సోమవారం వేకువ జామున 3 గంటల నుంచీ ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ మూ ర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. మూల విరాట్టుకు సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శన అవకాశం కల్పించారు. ఉత్తర ద్వారాన్ని ప్రత్యేక పుష్పాలంకరణతో తీర్చి దిద్దారు. నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దంపతులు, ఎమ్మెల్సీ కేవీ ప్రభాకర్ దంపతులు, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ సోదరి సంపతమ్మ పాల్గొని, ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్య క్షుడు కల్లే చంద్రశేఖరశర్మ, కార్యదర్శి హెచ్‌కే రాజశేఖర్, గౌరవ సలహాదారు హెచ్‌కే మనోహర్‌రావు, కేజీ ప్రభాకర్, ఉమేష్, రాజేశ్, టీటీడీ వేద పండితులు సాయి శ్రావణ్, మామిళ్లపల్లి రాజేశ్, ఆలయ అర్చకులు ప్రసన్న, సాయి, గురురాజా తదితరులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
వీఆర్ కాలనీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో...
స్థానిక వెంకటరమణ కాలనీలోని లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాలన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఉత్తర ద్వారంవద్ద పుష్పాలతో అలంకరించారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారికి, అమ్మవారికి పూజలు నిర్వహించారు.
కోడుమూరు(రూరల్): మండలంలోని గోరంట్లలో వెలసిన లక్ష్మీ మాధవస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పూజలు ఘనంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో వేకువనే పంచామృత, జలాభిషేకం నిర్వహించారు. పుష్పార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరిపించారు. స్వామిఅమ్మవార్లను పట్టువస్ర్తాలు, ఆభరణాలు, పూలమాలలు, తులసీదళాలతో అలంకరించారు. ఉత్తరద్వారం నుంచి భక్తులను అనుమతించారు. ఆలయ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీడీపీ మం డల కన్వీనర్ కోట్ల కవితమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. వర్కూరు శ్రీలక్ష్మీమాధవస్వామి ఆలయంలో స్వామిఅమ్మవార్లకు కల్యాణం చేపట్టి అన్నదానం నిర్వహించారు. వెంకటగిరి గిడ్డాంజనేయస్వామిని భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి మురళి పాల్గొన్నారు.
ఓర్వకల్లు: మండలంలోని ఉయ్యాలవాడ, కాల్వ, ఓర్వకల్లు, నన్నూరు, పూడిచెర్ల, మీదివేముల, సోమయాజులపల్లె, శకునాల తదితర గ్రామాల్లో సోమ వారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినం కావడంతో ఆయా ఆలయాల్లో వైకుంఠ ద్వారం దర్శనం కల్పించారు. భక్తులు ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి స్వాముల వారికి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓర్వకల్లులోని చెన్నకేశవస్వామి, రామాలయం, కాల్వ గ్రామాల్లో వేణుగోపాల స్వామి, ఉయ్యా లవాడ కొండపై వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో 108 జంటలు సత్యనా రాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. అర్చకులు సురేంద్ర శర్మ, మనోహర శర్మ, శశిధర శర్మలు ప్రత్యేక పూజలు జరిపి జంటలచే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కల్లూరు: కల్లూరులోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని కల్లూరు,కృష్ణానగర్, పందిపాడు, శ్రీసూర్యనారాయణస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే ఆలయాలకు క్యూకట్టిన భక్తులకు నిర్వాహకులు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అలాగే నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని శ్రీసూర్యనారాయణస్వామి ఆలయం, కల్లూరులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి, ట్రస్టీ శివరామకృష్ణ ఆద్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు.