శ్రీశైలంలో కుంభోత్సవం

ABN , First Publish Date - 2023-04-12T00:49:00+05:30 IST

శ్రీశైల మహా క్షేత్రంలోని భ్రమరాంబ అమ్మవారికి మంగళవారం శాస్ర్తోక్తంగా కుంభోత్సవం నిర్వహించారు.

శ్రీశైలంలో కుంభోత్సవం
రాసిగా పోసిన అన్నం

భ్రమరాంబ అమ్మవారికి సాత్విక బలులు

అమ్మవారి నిజరూప దర్శనం

ఉత్సవ నిర్వహణలో అధికారుల వైఫల్యం

శ్రీశైలం, ఏప్రిల్‌ 11: శ్రీశైల మహా క్షేత్రంలోని భ్రమరాంబ అమ్మవారికి మంగళవారం శాస్ర్తోక్తంగా కుంభోత్సవం నిర్వహించారు. ఏటా చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత అమ్మవారికి కుంభోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తోంది. ఇందులో భాగంగానే భ్రమరాంబ అమ్మవారి ఆలయాన్ని గుమ్మడి కాయలు, నిమ్మకాయలు, పుష్పాలతో అలంకరించారు. కుంభోత్సవాలలో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి ప్రాతఃకాల పూజలు చేశారు. హరిహరరాయ గోపురం వద్ద గల మహిషాసురమర్దినికి పూజాదికాలు జరిపి ఆ తర్వాత వేలాది గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలతోపాటు లక్షకు పైగా నిమ్మకాయలతో స్వాత్విక బలిని సమర్పించారు. ఉత్సవంలో పసుపు, కుంకుమలను రాసులతో సమర్పించి శాంతి క్రతువును సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి ప్రదోష కాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న సింహ మండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా పోశారు. ఆ తర్వాత సంప్రదాయాన్ని అనుసరించి స్ర్తీవేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి ఇచ్చారు. ఆ తర్వాత రెండో విడతగా అమ్మవారికి గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలతో సాత్విక బలిని ఇచ్చారు. చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. పిండి వంటలతో మహా నివేదన చేశారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం భ్రమరాంబ అమ్మవారు నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఫ దేవస్థానం అధికారుల వైఫల్యం

కుంభోత్సవ నిర్వహణలో దేవస్థానం యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఈ వేడుకకు శ్రీశైలానికి చెందిన స్థానికులతోపాటు సమీప చెంచుగూడేలకు చెందిన చెంచులను ఆలయం లోపలికి అనుమతించేవారు. ఈ ఉత్సవాన్ని శ్రీశైలం గ్రామ ప్రజలే ముందుండి సంబరంగా జరుపుకునేవారు. ఈసారి అలాంటివేమీ లేకుండా ఆలయ ప్రధాన ద్వారాలన్నీ మూసి క్షేత్రానికి వచ్చిన భక్తులతోపాటు స్థానికులకు ఆలయంలోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురి చేశారు. చివరికి మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం ఒక్కసారిగా ద్వారాలన్నీ తెరవడంతో భక్తులతోపాటు స్థానికులు ఆలయంలోకి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వారిని కట్టడి చేయడం పోలీసులు, దేవస్థానం భద్రత సిబ్బందికి సాధ్యం కాలేదు. అమ్మవారి ఆలయంలోని క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిశాయి. ఇంత జరుగుతున్నా క్యూలైన్లలో భక్తుల రద్దీని అదుపు చేసేందుకు దేవస్థానం అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.

Updated Date - 2023-04-12T00:49:02+05:30 IST