కైలాస వాహనంపై శివ పార్వతులు

ABN , First Publish Date - 2023-01-17T00:28:39+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రమణ సందర్భంగా ఈనెల 12వ తేదీన ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

 కైలాస వాహనంపై శివ పార్వతులు
కైలాస వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు

స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

శ్రీశైలం, జనవరి 16: శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రమణ సందర్భంగా ఈనెల 12వ తేదీన ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఐదో రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. మొదట స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను కైలాస వాహనంపై ఆశీనులను చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవం ఎదుట శంఖం, జేగంట, డమరుకం, కోలాటం, చెక్కభజన, డోలు విన్యాసాలు, చెంచుల నృత్యాలు ఆకట్టుకు న్నాయి. దేవస్థానం ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా గో పూజ

కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానం గో పూజను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం, దేవస్థానం గో సంరక్షణశాలలోని గోవులను పూజించారు. అనంతరం గోవులకు నూతన వస్త్రాలు సమర్పించారు.

ఆదివారం నందివానంపై శివపార్వతులు

శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నందివానంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం చండీశ్వర స్వామికి రుద్రపారాయణాలు, చతుర్వేదపారాయణాలు చేశారు.

కన్నుల పండువగా లీలా కళ్యాణం

బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి, అమ్మవార్లకు లీలా కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. చెంచులు స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు, ఆకులతో అల్లిన అభరణాలను సమర్పించారు. లీలా కల్యాణోత్సవంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి, నంద్యాల, ప్రకాశం జిల్లాల చెంచులు పాల్గొన్నారు.

నేడు పూర్ణాహుతి

మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు మంగళవారం స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం యాగపూర్ణాహుతి, అవభృదం, త్రిశూల స్నానం, సాయంత్రం సదస్యం, ధ్వజావరోహణ నిర్వహించనున్నారు.

Updated Date - 2023-01-17T00:28:42+05:30 IST