రింగు పడని వెదురు

ABN , First Publish Date - 2023-06-14T00:25:12+05:30 IST

వెదురు సేకరించాక సైజ్‌నుబట్టి గ్రేడింగ్‌ చేయాలి. సైజ్‌ తెలుసుకోడానికి వెదురుకు రింగ్‌ వేసి నిర్ధారించాలి.

   రింగు పడని వెదురు
నల్లమల అడవులు

- రుద్రవరం కలప డిపోలో నాన గ్రేడింగ్‌

- వెదురు కూపులను పరిశీలించని అధికారులు

- మేస్ర్తీలే పర్మిట్లు మంజూరు చేస్తున్న వైనం

- అక్రమంగా వెదురు రవాణా

- నాలుగు వెదురు కూపుల కేటాయింపు

- 1.39 లక్షల వెదుర్ల సేకరణే లక్ష్యం

రుద్రవరం, జూన్‌ 13 : వెదురు సేకరించాక సైజ్‌నుబట్టి గ్రేడింగ్‌ చేయాలి. సైజ్‌ తెలుసుకోడానికి వెదురుకు రింగ్‌ వేసి నిర్ధారించాలి. కానీ ఇదేదీ ఆచరణలోకి రావడం లేదు. రుద్రవరం కలప డిపోల పరిధిలో నాలుగు వెదురు కూపుల్లో వెదురు సేకరించాలి. దీని కోసం ఈ వెదురు కూపుల్లో బీసీ1 కింద ప్రభుత్వం టెండర్లు పిలిచింది. చిల్లమానుపెంట, మామిడి మాను చెలమ, గొర్రె గుంత, అహోబిలం కూపులను కేటాయించారు. అయితే వెదురు సేకరణ తర్వాత రింగులు వేసి గ్రేడింగ్‌ చేయడం లేదు.

కలప డిపోలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరించిన వెదుర్లను కొలతల ప్రకారం రింగులు వేసి గ్రేడింగ్‌ చేయాలి. ఇక్కడ అదేమీ జరగడం లేదు. అనామదిగ వెదురు గ్రేడింగ్‌ చేస్తున్నారు. మొదటి తరగతి వెదురు 12 నుంచి 15 సెంటీమీటర్లు చుట్టుకొలత, రెండో తరగతి 9 నుంచి 12 సెం.మీ, మూడో తరగతి 6 నుంచి 9 సెం.మీ, స్పెషల్‌ వెదుర్లు 16 నుంచి 18 సెం.మీ చుట్టు కొలత ఉండాలి. వీటిని గ్రేడింగ్‌ చేసి మొదటి తరగతి వెదుర్లు 3వేలు, రెండో తరగతి వెదుర్లు 4500, మూడో తరగతి వెదుర్లు 9వేలుగా లాట్లు ఏర్పాటు చేసి వేలం నిర్వహించాల్సి ఉంది.

రుద్రవరం కలప డిపోలో నాన గ్రేడింగ్‌:

రుద్రవరం కలప డిపోలో వెదుర్లను గ్రేడింగ్‌ చేయకుండానే లాట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ లాట్లను కూడా సరిగ్గా పరిశీలించకుండా జిల్లా ఫారెస్టు అధికారి వేలం వేస్తున్నారు. వెదురు కూపులో నరికిన చోటనే వెదుర్లను లెక్కించి లారీకి లోడు చేయించాలి. అధికారులు ఇవేవీ చేయడంలేదని విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి

రింగులు వేసి కొలతల వారీగా గ్రేడింగ్‌ చేయకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మొదటి తరగతి వెదుర్లు రెండో తరగతిలో రెండో తరగతి వెదుర్లు మూడో తరగతిలో ప్రత్యేక తరగతి వెదుర్లు మొదటి తరగతిలో కలిసిపోతున్నాయి. ఇలా కలిసిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

మేస్త్రీలు పర్మిట్లు మంజూరు చేస్తున్న వైనం:

నల్లమల వెదురు కూపుల్లో నరికిన వెదుర్లను ఒక చోటకు చేర్చి లెక్కించి సంబంధిత కూపు అధికారి పర్మిట్‌ మంజూరు చేయాలి. అయితే మేస్త్రీలతో పర్మిట్లను పంపడం ఆనవాయితీగా మారింది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అక్రమ రవాణా:

రుద్రవరం రేంజ్‌లో వెదురు, వెదురుతో చేసిన పరికరాలు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమంగా నరికి ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాలకు వెదుర్లను తరలిస్తున్నారు.

నాలుగు కూపుల కేటాయింపు:

రుద్రవరం కలప డిపోలో వెదురు సేకరణకు నాలుగు వెదురు కూపులను బీసీ1 కింద కేటాయించి టెండర్లు పిలిచారు. చిల్లమానుపెంట 1695 హెక్టార్లలో, మామిడిమానుచెలిమ 1531.78 హెక్టార్లలో, అహోబిలం 1471 హెక్టార్లలో, గొర్రెగుంత 1357 హెక్టార్లలో వెదురు కూపులు విస్తరించి ఉన్నాయి. వీటిలో బీసీ1, బీసీ 2, బీసీ3 లుగా విభజించారు. ఒక్కో సీజన్‌లో ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం బీసీ1 కింద కేటాయించారు. ఈ నెల 30వతేదీ వరకు వెదురు సేకరణ కొనసాగుతుంది. రుద్రవరం కలప డి పో పరిధిలో సుమారు 1.39 లక్షల వెదురు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది.

కేటాయించిన కూపుల్లో కాకుండానే..:

రుద్రవరం కలప డిపోలో ప్రస్తుతం వెదురు సేకరణ బీసీ1 కింద కేటాయించారు. ఈ విస్తీర్ణంలో వెదురు సేకరణ చేయాల్సి ఉంది. కానీ బీసీ1లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ నరుకుతున్నట్లు సమాచారం. అఽధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఎక్కడపడితే అక్కడ నరుకుతున్నారు. ఇలా చేయడంతో మరో సీజన్‌కు వెదురు లభించే అవకాశం లేదు.

చర్యలు తీసుకుంటాం - రేంజ ర్‌ శ్రీపతినాయుడు, రుద్రవరం

వెదురు కూపుల్లో వెదురు నరికివేతను పరిశీలిస్తాం. కేటాయించిన అధికారులే నరికిన చోట పర్మిట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అవకతవకలు జరగకుండా పరిశీలిస్తాం.

Updated Date - 2023-06-14T00:25:12+05:30 IST