Nara Lokesh: జగన్‌కు రివర్స్ ఆఫర్ ప్రకటించిన లోకేశ్
ABN , First Publish Date - 2023-02-27T20:57:24+05:30 IST
నన్ను ఒక్కడిని ఆపేందుకు వందలాది మంది పోలీసులను దింపుతున్నారు. సీఎం జగన్ (CM Jagan)కు రివర్స్ ఆఫర్ ఇస్తున్నా. 2019 ఎన్నికల్లో యువతకు..
తిరుపతి: ‘నన్ను ఒక్కడిని ఆపేందుకు వందలాది మంది పోలీసులను దింపుతున్నారు. సీఎం జగన్ (CM Jagan)కు రివర్స్ ఆఫర్ ఇస్తున్నా. 2019 ఎన్నికల్లో యువతకు ఇస్తానన్న 2.30 లక్షల ఉద్యోగాలు, ఏటా 6500 పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీల నిర్వహణ హామీలను నెరవేర్చండి. నా సౌండ్ వాహనాలు స్వచ్ఛందంగా ఇచ్చేస్తా. మహిళలకు 45 ఏళ్ళకే పెన్షన్, ఎందరు పిల్లలున్నా అమ్మఒడి, మద్య నిషేధం వంటి హామీలు అమలు చేయండి. నా మైక్ కూడా సరెండర్ చేసేస్తా. పోలీసులకు జగన్‌రెడ్డి చాలా బాకీ పడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, టీఏ, డీఏ బకాయిలు చెల్లించేస్తే స్టూల్ కూడా ఇచ్చేస్తా’ అంటూ జగన్‌కు నారా లోకేశ్ (Nara Lokesh) రివర్స్ ఆఫర్ ప్రకటించారు.
యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 29వ రోజైన సోమవారం ఉదయం తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి జలగలాంటి వ్యక్తని, పేదల రక్తం పీలుస్తున్నాడంటూ ఆరోపించారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరిట రూ.10 వేలు లాక్కుని పనికిరాని పట్టాలు ఇచ్చాడన్నారు. అవి బ్యాంకుల్లో చెల్లడం లేదని, రూపాయి కూడా రుణం పుట్టడం లేదన్నారు. జగన్‌ది దరిద్రపు పాదమని, ఆయన పాలనలో రాష్ట్రంలో అన్నీ అరిష్టాలే సంభవిస్తున్నాయన్నారు. కచ్చులూరు బోటు ప్రమాదంలో 51 మంది, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 15 మంది, అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో 62 మంది.. ఇలా వరుస ప్రమాదాల్లో జనం చనిపోతున్నారని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు యువకుడు
జగన్ రాయలసీమ (Rayalaseema) బిడ్డ కాదని, సీమకు పట్టిన శని అని లోకేశ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ముసలోడు ఎవరో యువకుడు ఎవరో చెప్పాలని ప్రజల్ని ప్రశ్నించారు. వెయ్యి మంది పోలీసులు అడ్డుకున్నా ఏడు కిలోమీటర్లు వేగంగా నడిచి సభ పెట్టిన నేత చంద్రబాబు యువకుడని కొనియాడారు. కొబ్బరికాయ కొట్టడానికి కూడా జగన్ ముసలోడిలాగా వంగలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. వెంకటేశ్వరస్వామి ఆలయ బోర్డు మెంబర్ పోస్టులను కూడా జగన్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన వారిని కూడా బోర్డులో వేసి జంబో బోర్డు ఏర్పాటు చేశాడని, టీటీడీ భూములను కూడా అమ్మాలని జగన్ ప్రయత్నించారని విమర్శించారు. మంత్రి రోజా, మంత్రి నారాయణస్వామి, తిరుపతి ఎమ్మెల్యే వెంకటేశ్వరస్వామి దర్శన టికెట్లు కూడా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కొండపై గంజాయి కూడా దొరికిందంటేనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. పింక్ డైమండ్ ఎక్కడుంది జగన్‌రెడ్డీ అంటూ ప్రశ్నించిన నారా లోకేశ్ దానిపై ప్రజలకు సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.