Lokesh Padayatra: జగన్‌పై లోకేష్ ఫైర్
ABN , First Publish Date - 2023-01-29T16:40:29+05:30 IST
సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో భాగంగా పాడి రైతులతో లోకేష్ ముఖాముఖి...
చిత్తూరు: సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో భాగంగా పాడి రైతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ (TDP) హయాంలో పాడి రైతులకు అండగా నిలిచామన్నారు. పాడి రైతులకు సబ్సిడీలో దాణా, సైలేజ్ తక్కువ రేటుకే అందించామని తెలిపారు. వైసీపీ (YCP) పాలనలో సబ్సిడీలు లేవని, దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని తప్పుబట్టారు. లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. పాడి పరిశ్రమపై జగన్‌రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదని ఎద్దేవాచేశారు. సహకార సంఘాల డైయిరీలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌రెడ్డి చిత్తూరు, ఒంగోలు డైయిరీలను అమూల్ డైరీ (Amul Dairy)కి కట్టబెట్టారని, రూ.650 కోట్ల విలువైన చిత్తూరు డైయిరీని అమూల్‌కి కట్టబెట్టడం దారుణమన్నారు. రైతుల పేరుతో రూ.3 వేల కోట్లు అప్పుతీసుకొని అమూల్‌కి కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. పాడి రైతుల పేరుతో జగన్‌రెడ్డి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గోపాలమిత్రలకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో జగన్ సర్కార్ ఉందని విమర్శించారు. పాడిరైతులకు పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెరిగేలా.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రణాళిక సిద్ధం చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు.