Yuvagalam: ప్రజా సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ.. ముందుకు కదిలిన లోకేష్
ABN , First Publish Date - 2023-06-15T21:52:06+05:30 IST
అడుగడుగునా ఎదురైన పల్లెలు. సాదర స్వాగతం పలికిన పల్లె పడతులు. ఐదేళ్లలో ఎదురైన నష్టాలు.. కష్టాలు చెప్పుకొంటూ కనికరించమని రైతుల అభ్యర్థనలు.
నెల్లూరు: అడుగడుగునా ఎదురైన పల్లెలు. సాదర స్వాగతం పలికిన పల్లె పడతులు. ఐదేళ్లలో ఎదురైన నష్టాలు.. కష్టాలు చెప్పుకొంటూ కనికరించమని రైతుల అభ్యర్థనలు. మాకు జరిగిన అన్యాయం చూడండయ్యా అన్న ముస్లింల ఆవేదనలు... తమ ప్రియతమ నేతతో ఫొటోలు దిగాలనే ఆశతో కాళ్లకు అడ్డంపడుతూ పాదయాత్రను వెన్నాడిన చిన్నారులు, యువత.. బాధితులను ఓదార్చుతూ, భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ, పల్లెదారుల వెంబడి, పొలం గట్ల వెంబడి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం 127వ రోజు పాదయాత్ర సాగింది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం బొమ్మవరం విడిది కేంద్రం నుంచి నుంచి గురువారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన లోకేష్ రాత్రి 9.30 గంటలకు బస కేంద్రానికి చేరుకున్నారు.
అంతకుముందు మధ్యాహ్నం నారా లోకేష్ యువతీ యువకులతో ముఖాముఖి కార్యక్రమంనిర్వహించారు. జగన్ పాలనలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయంటూ యువకుల ఆవేదనను విన్న లోకేష్ వారికి భవిష్యత్తుకు భరోసా కల్పించారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు క్యాంప్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. చిలకలమర్రి గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. మహానాడు వేదికగా ప్రకటించిన హామీలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని కోరుకున్నారు. గుడిగంట గ్రామంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు.