Padayatra: చిన్నారికి నామకరణం చేసిన లోకేశ్.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ అభిమానులు

ABN , First Publish Date - 2023-01-28T19:57:47+05:30 IST

పొలాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి సమస్యల్ని వివరించారు. మహిళలు తమ కష్టాలను చెప్పుకొన్నారు.

Padayatra: చిన్నారికి నామకరణం చేసిన లోకేశ్.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ అభిమానులు

చిత్తూరు: పొలాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి సమస్యల్ని వివరించారు. మహిళలు తమ కష్టాలను చెప్పుకొన్నారు. ఆయా కుల సంఘాలు తమపై ప్రభుత్వ కక్ష సాధింపు గురించి ఆవేదన చెందారు. ఇవీ శనివారం నాటి నారా లోకేశ్‌ (Nara Lokesh) రెండో రోజు యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)లో తారసపడ్డ ఘటనలు. ఇన్నాళ్లూ తమ సమస్యల గురించి నోరు విప్పాలంటే భయపడేవారంతా ఇప్పుడు లోకేశ్‌ ఎదుట ధైర్యంగా బాధలు చెప్పుకుంటున్నారు. అందరి బాధలు వింటున్న లోకేశ్‌, టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చాక వారందరికీ న్యాయం చేస్తానని స్పష్టమైన హామీలిస్తూ ముందుకు కదిలారు. స్థానికులతో పాటు బయటి ప్రాంతాల నుంచీ విపరీతంగా జనాలు హాజరుకావడంతో పాదయాత్ర సమయంలో రహదారంతా జనసంద్రమైంది.

లోకేశ్‌ మొదటి రోజు బస చేసిన పీఈఎస్‌ ప్రాంగణం నుంచి శనివారం ఉదయం 10 గంటలకు రెండో రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి పీఈఎస్‌ సమీపంలో నిర్మాణంలో ఆగిపోయిన వాల్మీకి, కురుబ కమ్యూనిటీ హాళ్లను పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.10 కోట్లతో నిర్మాణం ప్రారంభించిన ఈ భవనాల నిర్మాణాలు వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపేసిందని అక్కడి బీసీలు లోకేశ్‌ వద్ద ఆవేదన చెందారు. ఇక్కడి స్థలాన్ని వైసీపీ నాయకులు (YCP leaders) కబ్జా చేయడంతో పాటు ఈ భవనాలను బెల్టు షాపులుగా మార్చేశారని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు (Chandrababu) మీద నేరుగా కోపాన్ని చూపించలేక వైసీపీ నాయకులు భవన నిర్మాణాల్ని ఆపేసి కక్ష సాధిస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు.

విద్యా, వసతి దీవెనలేవీ?

అనంతరం పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ను కుప్పం డిగ్రీ కాలేజీ విద్యార్థులు కలిసి తమ సమస్యలను వివరించారు. విద్యా దీవెన, వసతి దీవెన తమకు అందడం లేదని, చేతి నుంచి డబ్బులు చెల్లిస్తున్నామని, కొత్త కోర్సులు పెట్టినా ల్యాబులు ఏర్పాటు చేయలేదని చెప్పారు. తాగునీటి సౌకర్యం కూడా లేదని ఫిర్యాదు చేయగా, ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని లోకేశ్‌ వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థులు లోకేశ్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. లోకేశ్‌ కూడా వాళ్ల సెల్‌ఫోన్‌తోనే సెల్ఫీలు తీసుకుని ఇచ్చారు.

చిన్నారికి నామకరణం

కుప్పం మండలం వడ్డిపల్లె గ్రామానికి చెందిన మద్దేటి రిషికేష్‌, అశ్వని దంపతులు లోకేశ్‌ బస చేసిన పీఈఎస్‌ కాలేజీ ప్రాంగణానికి 3 నెలల చంటి బిడ్డతో వచ్చారు. ఆ బిడ్డను ముద్దాడిన లోకేశ్‌ తల్లిదండ్రుల కోరిక మేరకు సాన్విత అని నామకరణం చేశారు.

చంద్రబాబు సాయంతో నడవగలుగుతున్నా

కుప్పం మొరసనపల్లెకు చెందిన తేజ అనే యువకుడు నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మంచం పడ్డారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే, అప్పటి సీఎం చంద్రబాబు అందించిన రూ.16 లక్షల సహాయనిధితో ఇప్పుడు నడవగలుగుతున్నాడు. లోకేశ్‌ పాదయాత్రకు వచ్చిన తేజ ‘చంద్రబాబు చేసిన సాయంతోనే తాను నడువగలుగుతున్నా.. ఏమిచ్చి చంద్రబాబు రుణం తీసుకోగలను’ అని లోకేశ్‌కు చెప్పుకున్నారు. లోకేశ్‌ అతడిని హత్తుకుని అధైర్యపడొద్దంటూ చెప్పడంతో తేజ ఆనందభాష్పాలను రాల్చాడు. అతి కష్టం మీద నడచి వచ్చిన తేజతో లోకేశ్‌ సెల్ఫీ దిగారు.

దారి పొడవునా హారతులు

కుప్పంలోని పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గుడుపల్లె, శాంతిపురం మండలాల మీదుగా పాదయాత్ర సాగగా, వేలాది మంది ఆయన వెంట నడిచారు. దారి పొడవునా మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. లోకేశ్‌ను చూసేందుకు వచ్చిన స్థానికులు, బయటి ప్రాంతాల వారితో జాతీయ రహదారి కిక్కిరిసింది. రెండో రోజు సుమారు 9.3 కిలోమీటర్లు నడచిన లోకేశ్‌ సాయంత్రం శాంతిపురం సమీపంలో ఏర్పాటుచేసిన ప్రాంగణంలో బస చేశారు. పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలు, రైతులు, విద్యార్థులు లోకేశ్‌ కోసం వేచి ఉండటాన్ని చూసి లోకేశ్‌ నేరుగా వారి వద్దకు వెళ్లిపోతున్నారు. ఖాళీ రోడ్డు ఉన్న మిగిలిన సమయాల్లో చాలా వేగంగా నడుస్తున్నారు. చాలామంది నాయకులు ఆయనతో సమానంగా నడవలేక వెనుకబడిపోయారు. ఆదివారంతో కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసి.. సోమవారం పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

Updated Date - 2023-01-28T19:57:48+05:30 IST