Lokesh Padayatra: మంత్రులపై లోకేశ్‌ సెటైర్లు

ABN , First Publish Date - 2023-03-02T20:48:17+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయ రంగం గురించి సంబంధిత మంత్రులెవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించిన నారా లోకేశ్‌ (NaraLokesh) కొందరిపై సెటైర్లు వేశారు.

Lokesh Padayatra: మంత్రులపై లోకేశ్‌ సెటైర్లు

తిరుపతి: రాష్ట్రంలో వ్యవసాయ రంగం గురించి సంబంధిత మంత్రులెవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించిన నారా లోకేశ్‌ (NaraLokesh) కొందరిపై సెటైర్లు వేశారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో భాగంగా లోకేశ్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ (CBI) చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని బల్లగుద్ది చెప్పిన ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ (Anil Kumar Yadav) తర్వాత మంత్రి పదవి నుంచీ పోయాడని ఎద్దేవా చేశారు. ఇక ప్రస్తుత ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు రోడ్లపై డ్యాన్సులు వేస్తున్నాడే తప్ప పోలవరాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి అయితే పోలవరం ప్రాజెక్టు (Polavaram project) మీద కనీస దృష్టి కూడా సారించడం లేదన్నారు.

గుంతలు పడిన రోడ్డు మీద లోకేశ్‌ సెల్ఫీ

గురువారం గుమ్మడి వారి ఇండ్లు విడిది కేంద్రం నుంచీ పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేశ్‌ జగన్‌ రోడ్డంతా గుంతలమయంగా వుండడంతో నడవడానికి ఇబ్బంది పడ్డారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, వాహనాల కాన్వాయ్‌ దానికి తోడు కావడంతో దుమ్ము రేగుతూ కనిపించింది. బందారుపల్లి దళితవాడ దగ్గరకు రాగానే సహనం కోల్పోయిన లోకేశ్‌ గుంతలు పడిన రోడ్డు కనిపించేలా సెల్ఫీ దిగారు. జగన్‌ గుంతల పథకం అంటూ ఎద్దేవా చేశారు. తర్వాత దామలచెరువులో ముస్లిం మైనారిటీలతో ముఖాముఖీ సమావేశమైన సందర్భంగా రోడ్ల దుస్థితిని ప్రస్తావించారు. తన 32 రోజుల పాదయాత్రలో తొలిసారి కాళ్ళ నొప్పులు వస్తున్నాయంటూ సెటైర్‌ విసిరారు.

తిరుపతి జిల్లాలో ముగిసిన యువగళం పాదయాత్ర

గురువారం సాయంత్రం పాదయాత్ర తిరుపతి జిల్లాలో ముగిసి మరోసారి చిత్తూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించింది. రాత్రి 7.10 గంటలకు పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డిగారిపల్లె సమీపంలోని విడిది కేంద్రానికి నారా లోకేశ్‌ చేరుకున్నారు. గత నెల 12వ తేదీ సాయంత్రం పుత్తూరు మండలం మీదుగా తిరుపతి జిల్లాలో ప్రవేశించిన యువగళం పాదయాత్ర 13వ తేదీ నుంచీ జిల్లాలో సాగింది. నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల మీదుగా జిల్లాలో తొలివిడత పాదయాత్ర ముగించారు. గత నెల 12వ తేదీ సాయంత్రం నుంచీ ఈనెల 2వ తేదీ గురువారం సాయంత్రం దాకా 200 కిలోమీటర్ల మేర తిరుపతి జిల్లాలో నారా లోకేశ్‌ పాదయాత్ర కొనసాగింది. గురువారం సాయంత్రం జిల్లాలో తొలి విడత పాదయాత్ర ముగిసింది.ఈ దఫా సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు రూట్‌ మ్యాప్‌లో లేవు. రెండో విడత పర్యటనలో ఈ నియోజకవర్గాలు కవర్‌ చేస్తారని సమాచారం.

Updated Date - 2023-03-02T20:48:17+05:30 IST