Lokesh Padayatra: మైకు లేకుండానే లోకేశ్ ప్రసంగం
ABN , First Publish Date - 2023-02-10T21:25:02+05:30 IST
గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లను, మానభంగం చేసినవాళ్లను, హంతకుల్ని, ఇసుక మాఫియా చేసేవాళ్లను ఈ ప్రభుత్వం పట్టుకోవడం లేదు....
చిత్తూరు: ‘గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లను, మానభంగం చేసినవాళ్లను, హంతకుల్ని, ఇసుక మాఫియా చేసేవాళ్లను ఈ ప్రభుత్వం పట్టుకోవడం లేదు. కానీ ఈ లోకేశ్ ఎప్పుడు స్టూల్ ఎక్కి మైకులో మాట్లాడతాడా అని పోలీసులు చుట్టూ కాపు కాస్తున్నారు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) దుయ్యబట్టారు. 15వ రోజు యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో భాగంగా శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం, శ్రీరంగరాజపురం మండలాల్లో పర్యటించారు. ఎస్సీలతో, కాపులతో, బెల్లం రైతులతో, బెంగళూరులో స్థిరపడిన స్థానికులతో పలుచోట్ల సమావేశమై ప్రసంగించారు.
మైకు లేకుండానే లోకేశ్ ప్రసంగం
లోకేశ్ పాదయాత్ర ప్రారంభం నుంచీ పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే లోకేశ్ మీద మూడు కేసులు నమోదు చేయగా, ప్రచార రథంతో పాటు రెండు సౌండ్ వెహికల్స్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర (Padayatra)లో లోకేశ్‌ను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి స్టూల్ ఎక్కి, మైకులో ప్రసంగించేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదు. జీడీనెల్లూరు మండలం సమిసిరెడ్డిపల్లెలో గురువారం లోకేశ్ నుంచి పోలీసులు మైకు లాక్కునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ శుక్రవారం నాటి పాదయాత్రలో ఆయా వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో మినహా రోడ్ల మీద ఎక్కడా మైకులో మాట్లాడలేదు. ప్రజలు అధికంగా ఉన్నచోట స్టూల్ మీద ఎక్కి మైకు లేకుండా మామూలుగానే మాట్లాడారు. రోజంతా అలా మాట్లాడడంతో సాయంత్రానికి లోకేశ్ గొంతులో మార్పులు కనిపించాయి.
15వ రోజు.. 14 కిలోమీటర్లు
యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ శుక్రవారం పాలసముద్రం, శ్రీరంగరాజపురం మండలాల్లో 14 కిలోమీటర్ల మేర నడిచారు. శుక్రవారం పాదయాత్రకు బయలుదేరే ముందు రేణుకాపురం శిబిరం వద్ద బెంగళూరు (Bangalore)లో స్థిరపడిన స్థానిక వ్యాపారులతో భేటీ అయ్యారు. టీడీపీ (TDP) వస్తే పారిశ్రామికవేత్తలకు ఇప్పటిలా వేధింపులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తామన్నారు. ఎగువకమ్మకండ్రిగలో నాగలితో పొలం దున్ని రైతుల సమస్యలు తెలుసుకున్న లోకేశ్, అనంతరం బెల్లం రైతులను కలిశారు. వైసీపీ ప్రభుత్వం వేధింపులతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నామన్నారు. మరో ఏడాది ఓపిక పడితే టీడీపీ అధికారంలోకి వచ్చి అన్నివిధాలా ఆదుకుంటామని బెల్లం రైతులకు లోకేశ్ హామీనిచ్చారు. గానుగలో బెల్లం తయారుచేశారు.
అనంతరం ఎస్సీలతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడిన లోకేశ్, దళితులకు వైసీపీ చేస్తున్న అన్యాయాలను, టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. కాపుకండ్రిగలో కాపు సామాజికవర్గీయులు లోకేశ్‌ను కలిసి రిజర్వేషన్ (Reservation) కల్పించాలని కోరారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ చిత్తశుద్ధితో ఉందని లోకేశ్ చెప్పారు. పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కు పెనుమూరు మండల పరిధిలోని కమ్మరాయగుట్ట కనిపించింది. ఈ గుట్టను వైసీపీ నేతలు తవ్వేస్తున్నారని చుట్టుపక్కనల గ్రామస్థులు ఆయనకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా వైసీపీ దొంగల చేతిలో కమ్మరాయగుట్ట మరో రుషికొండలా మారిందని లోకేశ్ ఆరోపించారు.