Lokesh : బీసీలను వేధిస్తే జైలే!
ABN, First Publish Date - 2023-07-28T03:59:06+05:30 IST
‘రాష్ట్రంలో చట్టాలను అమలుచేయాల్సిన పాలకులే సీబీఐ కేసుల్లో ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే బలహీనవర్గాల వారికి న్యాయం జరక్కపోగా వారిపై దాడులు పెరిగాయి. హత్యలు పెరిగాయి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదరి లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో
దోబీ పనులు ఎక్కడున్నా రజకులే చేసుకునేలా చర్యలు: లోకేశ్
డ్రై క్లీనింగ్ సెంటర్లు పెట్టిస్తాం
కులవృత్తులకు ప్రోత్సాహం
బటన్ నొక్కితే శాశ్వత కులధ్రువీకరణ పత్రం
‘జయహో బీసీ’ సదస్సులో హామీలు
ఒంగోలు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో చట్టాలను అమలుచేయాల్సిన పాలకులే సీబీఐ కేసుల్లో ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే బలహీనవర్గాల వారికి న్యాయం జరక్కపోగా వారిపై దాడులు పెరిగాయి. హత్యలు పెరిగాయి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదరి లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం ఒంగోలులో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలు, ప్రభుత్వ దురాగతాలకు బలైన బాధిత కుటుంబాల వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి బాధలు సావధానంగా విన్న లోకేశ్.. బాధిత కుటుంబాలందరినీ తమ పార్టీ ఆదుకుంటుందని.. అధికారంలోకి రాగానే నేరస్థులందరూ జైలు ఊచలు లెక్కపెట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువుల బాధ్యతలను తన తల్లి భువనేశ్వరి స్వీకరించినట్లు చెప్పారు. కేవలం 12 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో తిరిగే జగన్‌కు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సమయం దొరకలేదంటే బలహీనవర్గాల పట్ల ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవాలన్నారు. ఇంకా ఏమన్నారంటే..
బీసీలకు దన్ను..
బలహీనవర్గాల్లో ఉపకులాల వారీ కుల వృత్తులను ప్రోత్సహిస్తాం. గతంలో టీడీపీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరిస్తాం. బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తాం. బటన్ నొక్కితే శాశ్వత కులధ్రువీకరణ పత్రం ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఆయా కులవృత్తులకు అవసరమైన మేరకు ఉచిత విద్యుత్ ఇస్తాం. దోబీ పనులు ఎక్కడ ఉన్నా రజకులే చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. డ్రై క్లీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాం. బీసీలను ఈ ప్రభుత్వం చంపేస్తుంటే మంత్రి జోగి రమేశ్ తమది బీసీల ప్రభుత్వమంటూ ఊదరగొడుతున్నాడు. రాష్ట్రంలో 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టిన ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు బలహీనవర్గాలు సిద్ధంగా ఉన్నాయి.
బాధితుల వేదన..
సదస్సుకు వచ్చిన బాధిత కుటుంబాల సభ్యులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కర్నూలు జిల్లా గంజెళ్లకు చెందిన ఉప్పర లక్ష్మి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న తన కూతురు 5వ తరగతిలో ఉండగా ఓ వైసీపీ నాయకుడు మద్యం తాగి నరకం చూపించాడని.. అతడి భార్యే తన కూతురిని తీసుకెళ్లి భర్తకు అప్పగించిందని వాపోయారు. పాప కేకలు విని గ్రామస్థులు వెళ్లేసరికి ఆ నాయకుడు పారిపోయాడని.. నేటికీ అతడిపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపను తాము చదివిస్తామని లోకేశ్ ప్రకటించారు.
తన తండ్రి చంద్రయ్య గొంతుపై కత్తి పెట్టి జై జగన్ అనాలని వైసీపీ నాయకులు బలవంతం చేశారని.. కానీ తన తండ్రి జై చంద్రబాబు అనడంతో గొంతు కోసేశారని మాచర్ల నియోజకవర్గానికి చెందిన రామాంజనేయులు తెలిపారు. టీడీపీ అండతో తాను, చెల్లెలు చదువుకుంటున్నామన్నారు.
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు తన భర్త సుబ్బయ్యను చంపేశారని అపరాజిత తెలిపారు. లోకేశ్ వచ్చి పోరాడితే కేసు పెట్టారే తప్ప కనీసం చర్యలు తీసుకోలేదన్నారు. లోకేశ్ తమ పిల్లలను చదివిస్తూ ఆదుకుంటున్నారని తెలిపారు.
రేపల్లె నియోజకవర్గానికి చెందిన అమర్‌నాథ్‌గౌడ్ అక్క హేమశ్రీ తన తల్లితో వేదికపైకి వచ్చి.. తనను వేధించిన వారిని ప్రశ్నించినందుకు తమ్ముడిని వైసీపీ నాయకులు పెట్రోలు పోసి తగలబెట్టారంటూ ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు కష్టకాలంలో టీడీపీ అండగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం తనపై 14 అక్రమ కేసులు పెట్టిందని ఒంగోలుకు చెందిన షేక్ అజిమున్ చెప్పారు. కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను సంధానకర్తగా వ్యవహరించారు.
Updated at - 2023-07-28T03:59:40+05:30