Chittoor : కుప్పం పట్టణంలో భారీ పేలుడు.. పలు అనుమానాలకు తావిస్తున్న ఘటన
ABN , First Publish Date - 2023-06-26T09:50:39+05:30 IST
చిత్తూరు : జిల్లాలోని కుప్పం (Kuppam) పట్టణంలోని కొత్తపేటలో భారీ పేలుడు (Massive Explosion) సంభవించింది. ఓ ఇంటి ముందు భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న మురుగేషన్, ధనలక్ష్మి దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పిల్లలకు ముప్పు తప్పింది. తెల్లవారుజూమున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు...
చిత్తూరు : జిల్లాలోని కుప్పం (Kuppam) పట్టణంలోని కొత్తపేటలో భారీ పేలుడు (Massive Explosion) సంభవించింది. ఓ ఇంటి ముందు భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న మురుగేషన్, ధనలక్ష్మి దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పిల్లలకు ముప్పు తప్పింది. తెల్లవారుజూమున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భారీ పేలుడు థాటికి ఇంటి ముందు భాగం, కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. పేలుడుతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి గుమ్మం దగ్గర నాటు బాంబు పేల్చినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. గాయపడిన దంపతులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ పేలుడుపై పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కుప్పంలో ఇళ్ల మధ్య ఇలా భారీ పేలుడు సంభవించడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
కారణం ఇదేనా..?
కూలి చేసుకుని జీవనం చేసుకుంటూ కాపురమున్న భార్యాభర్తలను ఇంటి యజమానులు ఖాళీ చేయాలని చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పేలుడు జరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే.. దంపతులు టార్గెట్ చేసిన వారే పేలుళ్ళకు పాల్పడ్డారా..? లేకుంటే మరో కారణం ఏమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. కుప్పం నియోజకవర్గంలో వారంలో ఒకట్రెండు ఇలా పేలుళ్లు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పేలుడు జరిగిన ప్రతిసారీ జనాలకు గాయాలవ్వడం, ఇంటి గోడలు నెర్రలు వస్తున్నాయని పదేపదే అధికారులు, నేతలు కోరుతున్నప్పటికీ పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు కుప్పంలో మైనింగ్ ఎక్కువైపోయిందని జగన్ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.