Nara Lokesh: మోటార్లకు మీటర్లు.. రైతులకు ఉరితాళ్లు: నారా లోకేశ్‌

ABN , First Publish Date - 2023-03-07T21:01:58+05:30 IST

వలం అదనపు అప్పు కోసమే వ్యవసాయ మోటార్లకు జగన్‌రెడ్డి మీటర్లు బిగిస్తున్నాడు. ఒక్కసారి మీటరు బిగిస్తే తొలగించడం అసాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం బిగించే మీటార్లు..

Nara Lokesh: మోటార్లకు మీటర్లు.. రైతులకు ఉరితాళ్లు: నారా లోకేశ్‌

రాయచోటి : ‘‘కేవలం అదనపు అప్పు కోసమే వ్యవసాయ మోటార్లకు జగన్‌రెడ్డి మీటర్లు బిగిస్తున్నాడు. ఒక్కసారి మీటరు బిగిస్తే తొలగించడం అసాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం బిగించే మీటార్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. మీటర్లు బిగించడాన్ని రైతులందరూ వ్యతిరేకించండి. సర్వీసు తొలగిస్తే రాష్ట్రవ్యాప్తంగా అందరం ఉద్యమిద్దాం. ఉచిత విద్యుత్‌ మీ హక్కు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం వాండ్లపల్లెలో యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 37వ రోజు సందర్భంగా మంగళవారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో నీళ్లు అందక ఎంతో లోతులో బోరు తవ్వాల్సి ఉంటుందన్నారు. రైతుకు ఒక బోరు మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి అంటున్నాడన్నారు. మోటార్లకు మీటర్ల బిగింపు ఏ కొందరు రైతుల సమస్య కాదని, వైఎస్సార్‌ సీపీని బలపరిచే రైతులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తారన్నారు. టీడీపీ (TDP) హయాంలో రాయలసీమలో తాగునీటి రంగానికి 13 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రస్తుత సీఎం రాయలసీమకు 1000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని లోకేశ్ తెలిపారు.

చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు తలసరి అప్పు రూ.75 వేలు ఉండగా ఇప్పుడు అది రూ.2.5 లక్షలకు చేరిందన్నారు. ఇలా అయితే రైతులు ఏం వ్యవసాయం చేస్తారని నారా లోకేశ్‌ ప్రశ్నించారు. పాదయాత్రలో ఇప్పటి వరకు తాను 26 రైతు భరోసా కేంద్రాలను చూశానని, ఎప్పుడు చూసినా వాటికి తాళాలు వేసి ఉన్నాయన్నారు. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తంలోనూ జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో కలిపి ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి. కానీ జగన్‌ రూ.13,500 మాత్రమే ఇస్తున్నాడన్నారు. రైతులకు రూ.20 వేలు జగన్‌మోహన్‌రెడ్డి బాకీ పడ్డాడన్నారు. రోజుకో విధంగా టమోటా ధర మారుతుండడంతో గిట్టుబాటు ధర లేక టమోటా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్లు తెస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌ తర్వాత పట్టించుకోలేదన్నారు. ధరలు లేవని టమోటాలు పోయాల్సింది రోడ్ల మీద కాదు తాడేపల్లె కొంప ముందు పోయాలని నారా లోకేశ్‌ రైతులకు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-07T21:01:58+05:30 IST