Gudivada Amarnath: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణికుల వివరాలు ట్రేస్ చేశాం.. వారిలో ఒక్కరు మాత్రమే..
ABN , First Publish Date - 2023-06-05T11:38:03+05:30 IST
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి తెలుగువారిని కలిశామని.. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ సహా పలు ఆస్పత్రులకు పంపామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
అమరావతి: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి తెలుగువారిని కలిశామని.. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ సహా పలు ఆస్పత్రులకు పంపామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Minister Gudivada Amarnath) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ చెందిన వారు 309 మంది కోరమాండల్‌లో, 33మంది యశ్వంత్ పూర్‌లో మొత్తంగా 342 మంది ప్రయాణించారని గుర్తించినట్లు చెప్పారు. ప్రయాణించిన వారందరి వివరాలు ట్రేస్ అయ్యాయన్నారు. ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది మైనర్ గాయాలయ్యాయని.. ప్రస్తుతం విశాఖలో 8 మందికి చికిత్స అందించామని చెప్పారు. జనరల్ బోగీల్లో ప్రయాణించిన శ్రీకాకుళంకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి ఒక్కరే మృతి చెందినట్లు చెప్పారు. జనరల్ బోగీల్లో వెళ్లిన వారిలో ఇద్దరు విశాఖ, ఇద్దరు శ్రీకాకుళం వారు క్షేమంగా ఉన్నారని గుర్తించామని మంత్రి అన్నారు.
రైలు ప్రమాదంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 276 మంది మృతి చెందారన్నారు. చనిపోయిన వారిలో 89 మందిని ఇప్పటి వరకు గుర్తించారని.. ఇంకా 187 డెడ్ బాడీలు మార్చురీల్లో ఉన్నాయన్నారు. ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇంకా భువనేశ్వర్‌లో సహాయం అందించేందుకు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని కంట్రోల్ రూంకు కాల్స్ ఏవీ రావడం లేదన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అంబటి రాములు విజయవాడ నుంచి కోల్‌కతాకు వెళ్లారని మన కంట్రోల్ రూంకు ఫిర్యాదు వచ్చిందని అన్నారు. కంట్రోల్ రూం నుంచి వచ్చిన ఆ ఫిర్యాదును ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఎవరైనా కంట్రోల్ రూం లేదా వాట్సప్ కాల్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం సహాయక చర్యల్లో సమర్థంగా వ్యవహరించిందని తెలిపారు. ఘటనపై రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం, విమర్శలు చేయడం సరికాదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.