AP News: ఏపీకి ‘చల్లని’ కబురు

ABN , First Publish Date - 2023-06-11T19:00:52+05:30 IST

ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు. ఆదివారం కర్ణాటక, గోవా, కొంకన్‌లోని పలు ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరిలో అనేక ప్రాంతాలు, ఏపీలోని శ్రీహరికోట వరకు రుతుపవనాలు విస్తరించాయి.

AP News: ఏపీకి ‘చల్లని’ కబురు

అమరావతి: ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు. ఆదివారం కర్ణాటక, గోవా, కొంకన్‌లోని పలు ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరిలో అనేక ప్రాంతాలు, ఏపీలోని శ్రీహరికోట వరకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 48 గంటల్లో ఏపీలో మరిన్ని ప్రాంతాలు, తమిళనాడు, ఈశాన్య భారతంలో మిగిలిన భాగాలు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. జూన్‌ ఐదోతేదీ నాటికి ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో ప్రవేశించాల్సిన రుతు పవనాలు కేరళకు రావడంలో ఆలస్యం కావడంతో మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంలో జాప్యం జరిగింది. ఈనెల ఎనిమిదో తేదీన కేరళను తాకిన రుతుపవనాలు నెమ్మదిగా పయనించి, ఆదివారం శ్రీహరికోట వరకు విస్తరించాయి. కాగా రుతుపవనాల విస్తరణలో జాప్యం చోటుచేసుకోవడంతో కోస్తాలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి.

కాగా తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఉన్న అసాధారణ తుఫాన్‌ బిపర్జోయ్‌ ఈశాన్యంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి ముంబైకి 560 కి.మీ. పశ్చిమంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఈనెల 14వ తేదీ వరకు ఉత్తరంగా, ఆ తరువాత ఉత్తర ఈశాన్యంగా పయనించి ఈనెల 15వ తేదీ ఉదయం మాండ్వి (గుజరాత్‌), కరాచి (పాకిస్థాన్‌ మధ్య తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది.

వాస్తవానికి మన రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ తరువాత తొలుత రాయలసీమలో, ఆ తరువాత దక్షిణ కోస్తాలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. కానీ మూడు రోజుల ముందే ఏపీలోకి రుతుపవనాలు రావడం గమనార్హం. సాధారణంగా జూన్‌ 5న రాయలసీమ, 10న ఉత్తర కోస్తాకు రుతుపవనాలు రావలసి ఉంది. రుతుపవనాలు వచ్చేంత వరకు ఎండలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని కొన్ని మోడల్స్‌ వెల్లడిస్తున్నాయి. కాగా, ఐఎండీ గణాంకాల ప్రకారం 1918లో చాలా ముందుగా(మే 11న), 1972లో చాలా ఆలస్యం(జూన్‌ 18న)గా రుతుపవనాలు కేరళను తాకాయి. 2016, 2019 సంవత్సరాల్లో కూడా జూన్‌ 8న కేరళను రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది జూన్ 8న (గురువారం) కేరళలో ప్రవేశించాయి. వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు ఊతమిస్తాయి.

Updated Date - 2023-06-11T19:21:49+05:30 IST