Nara Lokesh : వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైంది

ABN , First Publish Date - 2023-05-05T11:15:34+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురంలో జరుగుతోంది. నేడు మార్కాపురం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.

Nara Lokesh : వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైంది

కర్నూలు : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురంలో జరుగుతోంది. నేడు మార్కాపురం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడని.. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి కుటుంబాలను విడదీస్తున్నాడని లోకేష్‌కు చెప్పారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్న ఇంటికి ఒక కుళాయి మాత్రమే ఇస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం కేసులను అడ్డగోలుగా బనాయిస్తున్నారన్నారు. కె.సుధాకర్ అనే వ్యక్తిని వైసీపీ నేతలు కొట్టి, తిరిగి బాధితుడిపైనే కేసులు పెట్టారన్నారు. తమ గ్రామంలో ఈ నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కల్తీ విత్తనాలు, పురుగు మందులతో తాము తీవ్రంగా నష్టపోయామన్నారు.

దీనిపై యువనేత లోకేష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైందన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నిర్బంధాలు, బెదిరింపులు, భూకబ్జాలు నిత్యకృత్యంగా మారాయన్నారు. రాష్ట్రంలో సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేస్తామన్నారు. అక్రమంగా ప్రజలను, టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసు అధికారులకు ఉద్వాసన పలుకుతామని నారా లోకేష్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా కనుమరుగైంది. పంచాయతీల నిధులు రూ.8,600కోట్లను ప్రభుత్వం దారిమళ్లించింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ఇంటింటికీ తాగునీటి కుళాయి ఇస్తాం. అడ్డగోలుగా పెంచిన పాఠశాల, కళాశాల ఫీజులను క్రమబద్దీకరించి, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్ధరిస్తాం. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపై ఉక్కుపాదం మోపుతాం. సామాన్యుడికి ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిర్మాణరంగానికి పూర్వవైభవం తెస్తాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-05-05T11:40:40+05:30 IST